Nara lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ..!

Nara lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ..!
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని లేఖలో కోరారు.

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని లేఖలో కోరారు.. రెండు దశల్లో కోవిడ్‌ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేటు టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.. పాఠశాలలు పునఃప్రారంభం రోజే కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ప్రైవేటు పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో ఒత్తిడికి గురై బలవన్మరణం చెందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ముందుగానే అర్థవంతమైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు లోకేష్‌.

రాష్ట్రంలో 12వేలకంటే ఎక్కువ ప్రైవేటు స్కూళ్లు ఉండగా, లక్షా 25వేల మంది టీచర్లు పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది మార్చిలో లాక్‌ డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది ప్రైవేటు టీచర్లకు సక్రమంగా జీతాలు లేవన్నారు. గత ఐదు నెలల్లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు భరించారన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితన్నారు లోకేష్‌. ఆకలి, అప్పుల సమస్య విద్యా రంగాన్ని ఎంతో బాధిస్తుండటం కలచివేస్తోందన్నారు. బోధనా వృత్తిలో జీతాలు రాక ఉపాధ్యాయులు కూరగాయలు అమ్ముకోవడం, భవన నిర్మాఱ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారడం వంటి విషాద గాధలు ఎన్నో మీడియాలో చూస్తున్నామన్నారు లోకేష్‌.

కోవిడ్‌ తదనంతర పరిణామాల వల్ల అనేక మంది ప్రైవేటు టీచర్లు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు లోకేష్‌. భారతీయ సంస్కృతి, సమాజ విలువలను తీర్చిదిద్దే గురువుల గురించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన మీరు ప్రైవేటు విద్యా రంగంలో పనిచేసే సిబ్బందికి తక్షణ సాయం అందించడం ద్వారా చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ప్రైవేటు టీచర్లకు ఇప్పటికే పొరుగుతున్న వున్న తెలంగాణ, కర్నాటక ప్రబుత్వాలతోపాటు ఇతర రాష్ట్రాలు తోచిన సాయం అందించాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నెలకు 2వేలు ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందించిందని గుర్తు చేశారు. కర్నాటక ప్రభుత్వం నెలకు ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం ప్రైవేటు టీచర్లకు అందించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేటు టీచర్ల జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story