Kakani: మంత్రి కాకాణిని కాపాడటం కోసం లొసుగులతో దర్యాప్తు?

Kakani: మంత్రి కాకాణిని కాపాడటం కోసం లొసుగులతో దర్యాప్తు?
సీబీఐ తీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలు

వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాలు, సాక్ష్యాలు, ఇతర పత్రాలతో కూడిన ప్రాపర్టీ నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన కేసులో సీబీఐ దర్యాప్తుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మంత్రి ప్రమేయం లేదని తేల్చేసేందుకు, ఆయన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో దర్యాప్తు చేపట్టిందా అన్నట్లుగా సీబీఐ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసులోఆధారాలు, సాక్ష్యాలు, ఇతర పత్రాలతో కూడిన ప్రాపర్టీ నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని పరిశీలిస్తే ఎవరికైనా సరే ఇదేం పరిశోధన అని అనిపించకమానదు. ఈ చోరీ ఘటనతో కాకాణికి సంబంధమే లేదంటూ చెప్పిన విషయాలేవి తార్కికంగా లేవు. వాటి మధ్య పొంతన లేదు. కొన్ని మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. సీబీఐ లాంటి ప్రఖ్యాత సంస్థ ఇలా లొసుగులతో దర్యాప్తు చేయడమేంటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చోరీ కేసులో నిందితులైన సయ్యద్‌ హయత్, ఖాజా రసూల్‌ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ఫుట్‌పాత్‌లపై నివసిస్తుంటారని, వారి వద్ద కనీసం మొబైల్‌ ఫోన్లూ లేవని అభియోగపత్రంలో ఒక పేరాలో సీబీఐ పేర్కొంది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆయన సన్నిహితులు, పీఏల కాల్‌డేటా రికార్డులు తీసుకుని విశ్లేషించామని వాటిల్లో వారెక్కడా నిందితులతో మాట్లాడినట్లు లేదని మరో పేరాలో ప్రస్తావించింది. దీన్నిబట్టి ఈ చోరీతో మంత్రికి ఎలాంటి సంబంధమూ లేదంటూ తేల్చేసింది. అసలు నిందితుల వద్ద మొబైల్‌ ఫోన్లే లేవని చెబుతూ, అదే సమయంలో వారితో కాకాణి, ఆయన సంబంధీకులెవరూ మాట్లాడినట్లు కాల్‌ డేటా రికార్డుల్లో ఎక్కడా లేదని పేర్కొనడం హాస్యాస్పదం కాదా? ఫోన్లే లేకపోతే కాల్‌డేటా రికార్డులు ఎలా లభిస్తాయి? ఈ ప్రశ్నకు సీబీఐ ఏం సమాధానం చెబుతుంది.

చోరీ ఘటనలో అరెస్టైన నిందితులు జైల్లో ఉన్నప్పుడు వారిని కొద్ది మంది బంధువులు తప్ప ఇతరులు కలవలేదని బెయిల్‌ వచ్చినా ష్యూరిటీలు సమర్పించేవారు లేక విడుదల కాలేదని...అందుకే ఈ ఘటనలో కుట్ర లేదనేది స్పష్టమవుతోంది అని సీబీఐ పేర్కొంది. కుట్రకు రూపకల్పన చేసినవారెవరైనా సరే ఆ నిందితుల్ని జైలుకు వెళ్లి కలుస్తారా? అలా కలిస్తే దొరికిపోతామని తెలియనంత అమాయకులా? వారికి ష్యూరిటీలు సమర్పించి బయటకు తీసుకొస్తే.. దాని వెనుక ఎవరున్నారనేది తెలిసిపోదా? ఈ మాత్రం తార్కికంగా సీబీఐ ఎందుకు ఆలోచించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story