CM Jagan: జగన్‌ పర్యటనలో సామాన్య ప్రజలు అవస్థలు

CM Jagan:  జగన్‌ పర్యటనలో  సామాన్య ప్రజలు అవస్థలు
సీఎం ప్రసంగం కంటే ముందుగానే జనం జంప్

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సుయాత్ర, సభలు ప్రజలకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. కాకినాడ జిల్లా అచ్చంపేటలో సీఎం సభ దృష్ట్యా... పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు సీఎం మేమంతా సిద్ధమంటుంటే... ప్రజలు మాత్రం సిద్ధంగా లేమని కరాఖండిగా చెప్పేశారు. సభకొచ్చిన కొద్దిమంది కూడా సీఎం ప్రసంగం కంటే ముందుగానేవెళ్లిపోయారు.

కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణం మండలం అచ్చంపేట కూడలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభ ప్రజలకు చుక్కలు చూపించింది. సభకు జనాన్ని తరలించేందుకు... ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు... పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో పడిగాపులు కాస్తూ... ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సీఎం బస్సుయాత్ర, సభకు ప్రజాదరణ కరవైంది. సీఎం బస్సులో వెళ్తున్నా ప్రజలెవరూ పట్టించుకోలేదు. సభలో జనం ఎక్కువమంది కనిపించాలని... ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌ కూపన్లు ఇచ్చారు. అంత కష్టపడి జనాన్ని తరలిస్తే... వారంతా సీఎం ప్రసంగిస్తుండగానే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు బారికేడ్లు పెట్టి... ఆపేందుకు ప్రయత్నించినప్పటకీ ఫలితం లేకుండా పోయింది.

మరోవైపు ఈ యాత్ర సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ.. సామర్లకోట, పెద్దాపురంలో ఎక్కడికక్కడే ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా.. ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుతో ఆస్పత్రులకు వెళ్లే రోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను గంటల తరబడి ఎండలోనే ఉంచుతున్నారు.

బస్సుయాత్రలో సీఎం జగన్‌కి విద్యార్థుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని గుండేపల్లి మండలం సూరంపల్లి వద్ద ఏడీబీ రోడ్డులో ఆదిత్య విశ్వవిద్యాలయం మీదుగా యాత్ర సాగింది. వర్సిటీ యాజమాన్యం జగనన్న విద్యాదీవెనతో మేలు జరిగిందని చెబుతూ... థాంక్యూ సీఎం సార్‌ అని ప్లెక్సీ ముద్రించి... విద్యార్థులతో నినాదాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల వద్ద బస్సు ఆపిన సీఎం విద్యాదీవెన అందరికీ అందుతుందా...? అని అడిగారు. ఇంతలో విద్యార్థులంతా ఒక్కసారిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కి అనుకూలంగా నినదించారు. నినాదాల తీవ్రత పెరగడంతో అసహనానికి గురైన సీఎం అక్కడి నుంచి వెనుదిరిగారు

Tags

Read MoreRead Less
Next Story