AP: వృద్ధుల ఉసురు పోసుకుంటారా..?

AP: వృద్ధుల ఉసురు పోసుకుంటారా..?
మండుటెండలో మరోసారి సచివాలయానికి నడిపిస్తారా... ఇప్పటికీ స్పష్టత ఇవ్వని అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండుతున్నాయి. 46 డిగ్రీల ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 లక్షల మంది పింఛనుదారుల జీవితాలతో వికృతక్రీడకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లో అమలుచేసిన ఆదేశాల్నే.. మే నెలలోనూ కొనసాగించే యోచన చేస్తోంది. సీఎం ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి, సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డి తదితరులంతా వైసీపీ కుటిల రాజకీయానికి వంతపాడుతున్నారు. వృద్ధులు నానాకష్టాలు పడుతున్నా.. ఏప్రిల్‌లో 30 మందికి పైగా మరణించినా వీరి మనసు కరగడం లేదు. వారంలో మే నెల పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా ఇంటి దగ్గరే పంపిణీపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండల్లో సచివాలయాలకు రప్పించి నరకయాతన పెట్టారు. ఇప్పుడూ అలాగే వృద్ధుల జీవితాలతో ఆటలాడుతూ.. మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘమూ జోక్యం చేసుకోవట్లేదు.

పాలనలో ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకునే సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి.. పింఛన్ల పంపిణీ విషయంలో ఇప్పుడు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సచివాలయాలకు నడవలేక రాష్ట్రంలో లక్షలమంది వృద్ధులు నరకయాతన పడుతున్నా నిర్ణయాల్ని ఎందుకు సమీక్షించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏప్రిల్‌లో పింఛన్ల కోసం తిరిగి వృద్ధులు మరణించినా...మళ్లీ మే నెలలోనూ వాటినే కొనసాగించి.. తెలుగుదేశంపైకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఆయనకు ఇంకా వైకాపా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపిస్తున్నాయి. తమ నిర్లక్ష్యం వల్ల ఏప్రిల్‌లో వృద్ధులు మరణించినా సీఎస్‌లోనూ మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యతను ఆయన ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పింఛనుదారుల ఇబ్బందులకు కారణమైన సీఎస్‌ను పదవి నుంచి తప్పించాలని డిమాండు చేస్తూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసినా... ఆయన తన వైఖరిని ఎందుకు మార్చుకోవడం లేదు.

అసలు సజావుగా సాగాల్సిన పింఛన్ల పంపిణీలో.. ఇన్ని సమస్యలకు కారణం మురళీధర్‌రెడ్డి నిర్ణయాలే. ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలూ ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నాయి. వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించాలనే ఆలోచన చేసిందీ సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డిలే. అదే 30 మందికి పైగా వృద్ధుల మరణాలకు దారితీసింది. కనీసం మే నెలలో అయినా ఇళ్లవద్దే పంపిణీ చేస్తే తమపై పడిన మచ్చను వారు కొంతైనా తుడిచేసుకునే అవకాశం లభిస్తుంది. అలా కాకుండా ఇప్పటికీ వైకాపా సేవే ముఖ్యం అనుకుంటే మరింత మంది వృద్ధుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన పాపం ఆయనదే అవుతుంది.

ముదిరిన ఎండలు, పెరిగిన వడగాలుల తీవ్రత నేపథ్యంలో కిలోమీటర్లు నడిస్తే.. వృద్ధుల ప్రాణాలకే ప్రమాదమని సీఈఓ మీనాకు చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించి ఎందుకు జోక్యం కోరడం లేదనేది ప్రశ్న. ఏప్రిల్‌లో పింఛను కష్టాలు, మరణాలు ఆయనకు తెలుసు. అయినా వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చిందని.. సరిదిద్దాల్సిందీ వారేనని, తనకేమీ సంబంధం లేదని ఎలా తప్పించుకుంటారు. వృద్ధుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న నేతల తీరును సీఈసీ దృష్టికి తీసుకెళ్లారా..? రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థను రద్దుచేశారంటూ ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి.. ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరిస్తున్నా దానిపైనా ఎందుకు నోరు మెదపడం లేదనేది ప్రశ్నార్థకం.

Tags

Read MoreRead Less
Next Story