PK: గుడ్డు మంత్రి అవినీతి వల్లే టికెట్‌ రాలేదు

PK: గుడ్డు మంత్రి అవినీతి వల్లే టికెట్‌ రాలేదు
అనకాపల్లిలో పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్యాస్త్రాలు... ఏపీను ‌డ్రగ్స్‌ రాజధాని చేశారని ఆవేదన

ఒక వ్యక్తికి అధికారం ఇస్తే అతని వ్యక్తిత్వం బయటపడుతుందన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌... సీఎం జగన్‌ విషయంలోనూ అదే జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు కానీ, ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్‌ రాజధానిగా చేశారని వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. జగన్‌ ఓ నాయకుడే కాదని ధ్వజమెత్తారు. యువతను మత్తులోకి దించుతున్న ఈ క్రిమినల్‌ ప్రభుత్వాన్ని... ఎన్డీయే కూటమిగా రోడ్డుపైకి ఈడ్చి, రాష్ట్ర సరిహద్దుల్లో పడేస్తామని ధ్వజమెత్తారు.


అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్‌ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వం, మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో అనకాపల్లి పేరు చెబితే బెల్లం గురించి మాట్లాడేవారని... వైసీపీ వచ్చాక కోడిగుడ్డు మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. గుడ్డు మంత్రి అవినీతి వల్లే జగన్‌.. ఇక్కడ టికెట్‌ ఇవ్వకుండా పంపించేశారని ఆరోపించారు. బినామీలను పెట్టుకుని ఆ మంత్రి సాగించిన అరాచకాలు అన్నీఇన్నీ కావన్న పవన్‌ కల్యాణ్‌ కూటమి రాగానే ఈ బినామీల భరతం పడతామని హెచ్చరించారు. పదవి కావాలనుకుంటే ప్రధానిని అడిగితే ఎప్పుడో ఇచ్చేవారన్న పవన్‌కల్యాణ్‌ తన ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని... రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలనే కూటమిగా కలిసి పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

విశాఖ జిల్లా నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రి, విప్‌ పదవుల్లో ఉన్నా... వారు కనీసం కిలోమీటరు రోడ్డు కూడా వేయలేకపోయారని విమర్శించారు. మద్యం, ఇసుక మీద లక్షల కోట్లు సంపాందించిన జగన్‌... నాయకుడు కాదని, ఓ కిరాయి వ్యాపారంటూ పవన్‌ ఘాటు విమర్శలు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తెలంగాణలో సమ్మక సారలమ్మ జాతర మాదిరిగా నూకాలమ్మ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం జరిపిస్తుందని పవన్‌ హామీ ఇచ్చారు. అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీగా భాజపా తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను పవన్‌ కోరారు. పవన్‌ నిర్వహించిన ర్యాలీకి భారీ స్పందన లభించింది. ఎన్డీఏ శ్రేణులతో అనకాపల్లి రోడ్లు కిక్కిరిసిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story