Visakhapatnam: కాబోయే భర్త గొంతుకోసిన కేసులో బాధితుడి వాంగ్మూలం.. పెళ్లి ఇష్టం లేదనే ఇలా చేసిందంటూ..

Visakhapatnam: కాబోయే భర్త గొంతుకోసిన కేసులో బాధితుడి వాంగ్మూలం.. పెళ్లి ఇష్టం లేదనే ఇలా చేసిందంటూ..
Visakhapatnam: కాబోయే భర్త గొంతు కోసిన ఘటనలో వధువు పుష్పను అదుపులోకి తీసుకున్నారు విశాఖ జిల్లా బుచ్చియ్యపేట పోలీసులు.

Visakhapatnam: కాబోయే భర్త గొంతు కోసిన ఘటనలో వధువు పుష్పను అదుపులోకి తీసుకున్నారు విశాఖ జిల్లా బుచ్చియ్యపేట పోలీసులు. ప్లాన్‌ ప్రకారమే రామునాయుడిపై పుష్ప దాడి చేసిందా లేక ఇద్దరూ కలిసి వెళ్లినప్పుడు ఇంకేదైనా జరిగిందా అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అబ్బాయి వర్షన్ ప్రకారం.. అమ్మాయే సర్‌ప్రైజ్‌ ఇస్తానంటూ గొంతుకోసిందని చెబుతున్నాడు.

గొంతు కోసిన తరువాత.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందునే ఇలా చేస్తున్నానని పుష్ప చెప్పిందని చెప్పుకొచ్చాడు రామునాయుడు. కాని, పుష్ప తల్లి మాత్రం.. తనే కావాలని గొంతు కోసుకుని అమ్మాయిపై నేరం మోపుతున్నాడని చెబుతోంది. అయితే, అమ్మాయిని బద్నాం చేయడానికి మరీ 30 కుట్లు పడేలా గొంతు కోసుకుంటాడా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అటు పుష్ప తల్లి వర్షన్‌పైనా రామునాయుడు స్పందించాడు.

ఘటనా స్థలంలో ఇద్దరమే ఉన్నామని, పుష్ప గొంతు కోయలేదని పుష్ప తల్లి ఎలా చెప్పగలరని ప్రశ్నిస్తున్నాడు. పుష్ప-రామునాయుడు మధ్య ఏం జరిగింది, మెడ కోసింది ఎవరు, ఎందుకు కోశారు అనే వివరాలను కాసేపట్లో మీడియాకు చెప్పనున్నారు బుచ్చియ్యపేట పోలీసులు. అయితే, రామునాయుడు వర్షన్ ప్రకారం.. తన స్నేహితులకు పరిచయం చేస్తానంటూ పుష్పనే బాబా ఆశ్రమానికి తీసుకెళ్లింది.

అమరిపురి బాబా ఆశ్రమం కొండపైన ఎవరూ కనిపించకపోవడంతో.. స్నేహితులు ఎక్కడ అని రామునాయుడు ప్రశ్నించాడు. కేక్‌ తీసుకొచ్చేందుకు వెళ్లారంటూ కబుర్లు చెప్పింది. ఆ తరువాత ఓ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పి కళ్లు మూసింది. రామునాయుడు కళ్లు తెరుస్తుండడంతో.. తన చున్నీతోనే కళ్లకు గంతలు కట్టింది. ముందుగానే తెచ్చుకున్న కత్తితో కాబోయే భర్త కంఠం కోసేసింది. గొంతు కోసిన వెంటనే 108కి, తన బావకి కాల్‌ చేశాడు రామునాయుడు.

ఇద్దరూ కలిసి వెళ్లిన స్కూటీపైనే కొండ కిందకు వచ్చాడు. అక్కడి నుంచి ఇద్దరి సాయంతో ఆస్పత్రికి వచ్చాడు. విషయం రెండు కుటుంబాల వాళ్లకి తెలియడంతో హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం కోటపాడు గ్రామానికి చెందిన రామునాయుడు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఇతనికి, రావికమతానికి చెందిన పుష్పకు ఈ నెల 4న నిశ్చితార్థం జరిగింది.

వచ్చే నెలలో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. ప్రస్తుతం అనకాపల్లి ఆస్పత్రిలో రామునాయుడు చికిత్స పొందుతున్నాడు. కత్తి పదునుదే అయినా.. మెడ నరాలు గాని, కండరాలకు గాని లోతుగా గాయాలు అవ్వలేదని డాక్టర్లు చెబుతున్నారు. 30 వరకు కుట్లు వేశామని, ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలిపారు.

అయితే, కొండపైకి వెళ్లిన తరువాత ఇద్దరి మధ్య ఏదైనా తగువు జరిగిందా, ఒకవేళ అదే జరిగి ఉంటే.. కత్తితో దాడి చేసేంత గొడవ అవుతుందా, అప్పటికే చేతిలో కత్తి ఎలా వచ్చింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామునాయుడుతో కలిసి వెళ్తున్నప్పుడే మధ్యలో పనుందంటూ ఓ ఐదు నిమిషాల పాటు పుష్ప కనిపించకుండా పోయింది. ఆ సమయంలోనే పీక కోసేందుకు కత్తిని కొనిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా పోలీసుల విచారణలో అసలు వాస్తవం ఏంటో బయటకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story