BJP: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు పురందేశ్వరి లేఖ

BJP: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు పురందేశ్వరి లేఖ
విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వినతి... అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు

అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి, జగన్ పదే పదే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ D.Y.చంద్రచూడ్ కు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. పదేళ్లుగా కేసుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి చేసిన అవినీతి, దోపిడీని ప్రస్తావించిన తనపై నేరుగా విలేకరుల సమావేశంలోనే బెదిరింపులకు దిగిన విషయం లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీల నేతలు, వ్యాపారులు, ప్రజలనూ ఇలాగే బెదిరిస్తున్నారని... అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు.


కేసులు నమోదైనప్పుడు జగన్ తో పాటు విజయసాయిరెడ్డి తక్కువ ప్రభావంతమైన పదవుల్లో ఉన్నారని... ఇప్పుడు అత్యున్నత అధికార పదవుల్లో ఉన్నారని పురందేశ్వరి గుర్తుచేశారు. తాను భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు.... భయంతో జీవిస్తున్న ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి సమస్యల్లో కొన్నింటిని ప్రస్తావించినప్పుడు.... ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశంలోనే తనను బెదిరించారని సీజేఐకి తెలిపారు. మళ్లీ ఇలాంటి అంశాలపై మాట్లాడితే, ప్రజల మధ్య తిరగకుండా చేస్తానంటూ బెదిరించారని, వ్యక్తిగత దూషణలకు దిగారని వివరించారు. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నా ఏ స్థాయిలో బెదిరించగలరో చెప్పడానికి.... తనను బెదిరించిన విధానమే ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను, సాక్షులను కూడా విజయసాయిరెడ్డి ఎలా బెదిరించిగలరో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోవ్యాపారవేత్తలు, వివిధ రంగాల ముఖ్యులు కూడా భయాందోళనలో ఉన్నారన్న పురందేశ్వరి... ఈ బెదిరింపులను బెయిల్ షరతుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరారు. పదేళ్లుగా వ్యవస్థలోని కొన్ని అవకాశాలను వినియోగించుకుని విజయసాయిరెడ్డి, జగన్ మోహను రెడ్డి వంటివారు బెయిల్ పై తిరుగుతూ నేరాల్లో భాగస్వాములు అవుతున్నందున.... వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అందువల్ల తన లేఖను పరిశీలించి, అందులో ప్రస్తావించిన అంశాల్లో జోక్యం చేసుకుని.... ఇద్దరి బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. వచ్చే 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ కొలిక్కి తెచ్చి, దోషులని తేలిన వారిపైన న్యాయపరమైన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

విజయసాయిరెడ్డికి సంబంధించిన అన్ని కేసుల వివరాలు, ఏపీ మద్యం కుంభకోణంపై కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖ ప్రతిని, ఇసుక అక్రమ తవ్వకాలపై ఐటీ కమిషనర్ కు రాసిన ప్రతిని... సీజేఐకి రాసిన లేఖకు జత చేశారు. వివేకా హత్యను తప్పుదోవ పట్టించేలా విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగ వివరాలు, విశాఖలో ఆయన భూకుంభకోణాలపై పత్రికా కథనాలు, తనను ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన బెదిరింపు ప్రసంగ వివరాలను.... సీజేఐకి రాసిన లేఖకు పురందేశ్వరి జత చేశారు.

Tags

Read MoreRead Less
Next Story