AP Current Charges : భవిష్యత్‌లో కరెంట్‌ కోతలు అధికంగా ఉంటాయి.. ప్రజలు సిద్ధంగా ఉండాలి : సజ్జల

AP Current Charges : భవిష్యత్‌లో కరెంట్‌ కోతలు అధికంగా ఉంటాయి.. ప్రజలు  సిద్ధంగా ఉండాలి : సజ్జల
AP Current Charges : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతల ముప్పు పొంచి ఉంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం ఏపీపైనా పడనుంది.

AP Current Charges : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతల ముప్పు పొంచి ఉంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం ఏపీపైనా పడనుంది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్ వినియోగాన్నితగ్గించాలని విజ్ఞప్తి చేశారాయన. భవిష్యత్తులో కరెంట్ కోతలు ఎక్కువగా ఉంటాయని.. అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం శీతాకాలంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తే... ఆ నిల్వలు వేసవికాలంలో పనికొస్తాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఐదారు నెలల్లో ప్రజలంతా పరిమిత స్థాయిలో వినియోగించాలన్నారు. లేకుంటే పరిస్థితి చేయిదాటే ప్రమాదముందని హెచ్చరించారు.

రానున్న రోజుల్లో విద్యుత్ కొనుగోలు కూడా భారమయ్యే అవకాశముందన్నారు సజ్జల. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధర కూడా పెరిగిందన్నారు. యూనిట్ ధర రూ.20 నుంచి 25 వరకు పెరిగే అవకాశముందన్నారు. కోవిడ్ టైమ్ లో ఆక్సిజన్ కొరత ఎలా ఉందో విద్యుత్ కొరత కూడా అలాగే ఉండొచ్చని హెచ్చరించారాయన. ప్రజలంతా బాధ్యతాయుతంగా ఆలోచించి విద్యుత్ ఆదా చేయాలని సజ్జల సూచించారు. ప్రజలు రాత్రి 6-8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. విద్యుత్ విషయంలో కేంద్ర మంత్రి చెప్పిన అంశంలో వాస్తవం లేదని సజ్జల అన్నారు.

దేశవ్యాప్తంగా విద్యుత్ కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఏపీ సహా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కరెంట్ కోతలు అమలవుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో బొగ్గు ఆథారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గింది. దీంతో రాష్ట్రాల అవసరాలకు సరిపడినంత కరెంట్ లేకపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి. దీని కారణంగా పలు రాష్ట్రాలు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నాయి.

ఓవైపు కరెంట్ కోతలు జరుగుతుంటే.. కేంద్రం మాత్రం అంధకారం అని తప్పుడు ప్రచారం చేయొద్దంటూ చెబుతోంది. అనవసరంగా ఆందోళనకర, గందరగోళ సమస్యలు సృష్టించవద్దంటున్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్. ఆదేశాలిచ్చారు. దేశంలో సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. రానున్న రోజుల్లో సరఫరా క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. దేశంలోని అన్ని థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయంటూ కేంద్ర విద్యుత్ శాఖ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో విద్యుదుత్పత్తికి సంబంధించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీకిస్తున్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story