AP: జోరుగా కోడి పందేలు

AP: జోరుగా కోడి పందేలు
నిబంధనలు ఉల్లంఘించి మరీ బరులు... ప్రజా ప్రతినిధుల అండతో కోట్లల్లో పందేలు

కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భోగి రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి. వీటిలో పాల్గొనడానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. వైసీపీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా పందేలు సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో తీర ప్రాంతం, మెట్ట ప్రాంతం అనే తేడా లేకుండా బరులు వెలిశాయి. కోట్ల రూపాయలు పందెం రాయుళ్ల చేతులు మారుతాయి. వాటిపై నిషేధం ఉన్నా... ప్రజా ప్రతినిధుల అండతో యథేచ్ఛగా సాగిపోతున్నాయి. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణాలో జనంతో బరులు కిక్కిరిసాయి.


కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో కోడిపందాలు, గుండాటలు జోరుగా సాగాయి. కొన్ని నియోజకవర్గాల్లో కోడిపందాల బరులు అధికార పార్టీ నాయకుల అండదండలతో వాడవాడలా వెలిశాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఉండ్రాజవరంలో నాలుగు చోట్ల పందాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరుతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో ఏటా మాదిరిగానే భారీ స్థాయిలో కోడిపందేలు, కోతముక్క, ఇతర జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. 16వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 25 ఎకరాల ప్రైవేటు స్థలంలో ప్రత్యేకంగా బరులు, వేదికలు ఏర్పాటు చేశారు. మూడురోజుల పాటు జూద శిబిరాలు కొనసాగేలా సకల సౌకర్యాలు కల్పించారు. సీఎం జగన్‌, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నియోజకవర్గ వైసీపీ నాయకుల చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.


ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగాయి. చిన్న, పెద్ద స్థాయిలో బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. వాటిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వీక్షకులు, పందెం రాయుళ్లు తరలి వచ్చారు. ఉండి, మహాదేవపట్నం గ్రామాల్లో పందేల స్థావరాల వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు ఊపందుకున్నాయి. తీరప్రాంతం, మెట్ట ప్రాంతం అనే తేడా లేకుండా బరులు వెలిశాయి. గుడివాడ, పెనమలూరు, కైకలూరుతోపాటు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పందేలు జోరుగా సాగాయి. పంటపొలాలు, మామిడి తోటలను కోడి పందేలకు బరులుగా మలిచారు. రాత్రివేళ కూడా నిర్వహించేందుకు వీలుగా జనరేటర్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలతోపాటు జూదం, గుండాట వంటి క్రీడలను ఏర్పాటు చేశారు. ఆకివీడు, నిడమర్రు, ఉండి, భీమవరం, జంగారెడ్డిగూడెం మండలాల్లో తొలి రోజు నుంచే రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. ఉండి, కాళ్ల మండలంలో కోడి పందేల కోసం ప్రత్యేక మైదానం ఏర్పాటు చేశారు. క్రికెట్‌ మైదానంలా కోడిపందేల వీక్షణకు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story