Sanitation Workers: కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన..

Sanitation Workers: కొనసాగుతున్న  పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన..

డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. హామీలు నెరవేర్చాల్సిందేనంటూ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తంచేశారు. సమ్మెతో పేరుకుపోయిన చెత్తను ఎత్తేందుకు కొన్నిచోట్ల అధికారులు ప్రయత్నించగా... కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం, ఘర్షణ తలెత్తింది. కొందరు అధికారులుకార్మికులను బెదిరించి, ప్రైవేటు వ్యక్తులతో చెత్తను ఎత్తించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన కార్మికులు... డిమాండ్లు సాధించేవరకూ విశ్రమించబోమని తేల్చిచెప్పారు.

గుంటూరు జిల్లా తెనాలిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత తలెత్తింది. హెల్త్‌ ఆఫీసర్‌ నిర్మల ప్రైవేట్‌ కార్మికులతో పనులు చేయిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మలపనులు అడ్డుకుంటే మీ సంగతి తేలుస్తానంటూ బెదిరించారు. కాళ్లు విరగ్గొడతానని మహిళా కార్మికులను హెచ్చరించారు.


పనిచేసే వాళ్లను అడ్డుకుంటే కేసులు పెడతానన్నారు. మహిళా కార్మికులపైకి పోలీసులను ఉసిగొల్పారు. హెల్త్ ఆఫీసర్‌ తీరుపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించి పొర్లు దండాలు పెట్టారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న కార్మికుల ప్రదేశంలో పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. కార్మికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పోలీసులు కొంత మంది కార్మికులను అరెస్టు చేసి ఠాణాకు తరలించగా... సంఘాల నేతలు వారిని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు.

విజయవాడ ధర్నా చౌక్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజూ కొనసాగింది. NTR జిల్లా నందిగామలో కార్మికుల సమ్మెతో చెత్త పేరుకుపోయింది. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఒంటి కాలితో నిరసన వ్యక్తం చేశారు. కనిగిరిలో ఆందోళనలో పాల్గొన్న కార్మికులకు తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు. నెల్లూరులో సమ్మెతో పేరుకుపోయిన చెత్తను ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో మహిళా కార్మికులకు, అధికారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కడపలో మున్సిపల్‌ కార్మికులు భిక్షాటన చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి భిక్షం ఎత్తారు. రాయచోటిలో తమ ఆవేదన వినాలంటూ డప్పులు వాయిస్తూ నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలిలో ధర్నా చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కార్మికుల సమ్మెకు తెలుగుదేశం నేతలు మద్దతు తెలిపారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు... సీఎం, సజ్జల, మంత్రి సురేష్‌ చిత్రపటాలను ముఖాలకు తగిలించుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. హిందూపురంలో చెత్త ఎత్తుతున్న ప్రైవేటు వ్యక్తులను అడ్డుకున్న కార్మికులు.. వారిని వెనక్కి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story