AP HC: ఏపీ హైకోర్టును నలుగురు కొత్త జడ్జీలు

AP HC: ఏపీ హైకోర్టును నలుగురు కొత్త జడ్జీలు
కొలిజియం సిఫారసు... కేంద్రం ఆమోదముద్రే తరువాయి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి పంపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల నేతృత్వంలోని కొలీజియం.. న్యాయవాదులు హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేసింది. ఇద్దరు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులతో సంప్రదించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫిబ్రవరి 22న ఈ నలుగురు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేశారని కొలీజియం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వీరి సీనియారిటీని నిర్ణయించనున్నట్లు పేర్కొంది.


ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు సీజే నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కోటా నుంచి హైకోర్టు జడ్జిలుగా నియమించేందుకు మొత్తం ఏడు పేర్లను సుప్రీంకోర్టుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌, యర్రంరెడ్డి నాగిరెడ్డి, ఎన్‌.రవిప్రసాద్‌, అశ్వత్థ నారాయణ పేర్లున్నట్లు సమాచారం. ఆ ఏడు పేర్లలో సుప్రీం కొలీజియం నాలుగు పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. 37 పోస్టులున్న ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నలుగురి నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య 6కి తగ్గుతుంది.

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాతకోట గ్రామంలో కృష్ణవేణి, బాల వెంకటరెడ్డి దంపతులకు 1972 జనవరి 12న హరినాథ్‌ నూనెపల్లి జన్మించారు. హైదరాబాద్‌లో 1987లో పదో తరగతి చదివారు. ఏలూరు CRR న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. కిరణ్మయి మండవ..1970 జులై 30న జన్మించారు. స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లా కూచిపూడి. మొవ్వ మండలం బార్లపూడి గ్రామంలో ప్రాథమిక విద్య, కూచిపూడిలో హైస్కూల్‌ విద్య పూర్తి చేశారు. సికింద్రాబాద్‌లోని వెస్లీ మహిళా కళాశాలలో ఇంటర్‌, ఉస్మానియా యూనివర్సిటీ న్యాయకళాశాలలో లా చదివారు. సుమతి జగడం 1971 జూన్‌ 28న జన్మించారు. స్వస్థలం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పండువారిపేట గ్రామం. హైదరాబాద్‌లోని హోలీ మేరీ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉస్మానియా వర్సిటీ మహిళా కళాశాలలో బీఏ చదివారు. అదే వర్సిటీ పరిధిలోని ఆంధ్ర మహిళా సభ మహిళా న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాపతి విజయ్‌ 1974 ఆగస్టు 8న రాజమహేంద్రవరంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1997లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

Tags

Read MoreRead Less
Next Story