VOTES: టీడీపీ ఓట్లు తొలగించే కుట్ర

VOTES: టీడీపీ ఓట్లు తొలగించే కుట్ర
నాన్‌ లోకల్‌ నెపంతో ఓట్ల తొలగింపు... వైసీపీ నేతలు యత్నిస్తున్నారన్న బండారు...

నాన్ లోకల్ పేరుతో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఎన్నికల అధికారులు, వైసీపీ నేతలు యత్నిస్తున్నారని టీడీపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆరోపించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఊర్లలో నివాసం ఉంటూ, పింఛన్ పొందుతున్న వారి ఓట్లను నాన్ లోకల్ పేరిట తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించమంటే పట్టించుకోని అధికారులు... వైసీపీ జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు చేయగానే... ఆగమేఘాలపై 3వేల మంది టీడీపీ సానుభూతిపరులకు నోటీసులు పంపడం ఏంటని ప్రశ్నించారు. కొత్తపేట నియోజకవర్గం ఓటరు జాబితాలో ఏ విధమైన తప్పిదాలు జరిగినా అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.


మరోవైపు 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లు తొలగించేందుకు భారీ కుట్ర జరిగింది. 2019 జనవరి 11 తర్వాత ఎన్నికల సంఘానికి 12.50 లక్షల ఫారం-7 దరఖాస్తులొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ ద్వారా గంపగుత్తగా కొందరు ఫారం-7 దరఖాస్తులు చేశారు. వాటిలో దాదాపు 9.50 లక్షల దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలోనే అందాయి. ఎన్నికల సంఘం బూత్‌ స్థాయి అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులతో పరిశీలన జరిపించగా... వాటిలో 1.41 లక్షల మందే అనర్హులున్నట్లు తేలింది. మిగతా 11 లక్షలకు పైగా దరఖాస్తులు అర్హుల ఓట్లు తొలగించాలంటూ వచ్చినవే. వాటిలో అత్యధికం కుట్రపూరితంగా చేసినవేనని గుర్తించిన ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసింది. ఆ దరఖాస్తులు చేసిన వారిలో 80 శాతానికి పైగా వైసీపీ సానుభూతిపరులు ఉన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో దర్యాప్తు పక్కకు పోయింది. సిట్‌ నివేదికా మూలనపడింది.

సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన నేరాల్ని తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ఈ కేసుల్ని ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోలేదు? మీనా ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులుగా ఉన్నవారు ఏం చేశారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ‘ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌కు దరఖాస్తులొచ్చిన ఐపీ అడ్రస్‌లు, మ్యాక్‌ అడ్రస్‌లు, ఐఎంఈఐ నంబర్ల వివరాలు ఇవ్వాల్సిందిగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయాన్ని కోరామని... కానీ ఇంతవరకూ స్పందన లేదని ఓ జిల్లా ఎస్పీ నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుల్ని పట్టుకోవడం కష్టమని.భవిష్యత్తులో ఏమైనా ఆధారాలు లభిస్తే కేసును రీ ఓపెన్‌ చేస్తామని కేసులపై మరో జిల్లా ఎస్పీ ఈ ఏడాది అక్టోబరు 17 నాటి స్టేటస్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story