Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానన్న టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటే‌శ్వర స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు వైకుంఠం కాంప్లెక్స్ వద్ద చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను చంద్రబాబు దంపతులకు అందజేశారు. చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాములో అరెస్ట్ , రిమాండ్ తర్వాత గత నెలలో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. కంటి శస్త్ర చికిత్సకు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు సాధారణ బెయిల్‌గా మార్చడంతో చంద్రబాబు తిరుమలలో మొక్కులు చెల్లించుకున్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీవారి పాదపద్మాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగానని అన్నారు. వెంకటేశ్వరుడు తమబ ఇంటి దైవమని, ఆయన్ని దర్శించుకుని ఏ కార్యక్రమం అయినా చేపడతానని బాబు చెప్పారు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు కాపాడారు. ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్ధించా, తెలుగు జాతి ప్రపంచంలోనే నెం.1గా ఉండాలి.. ప్రజలకు సేవచేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలేకాక.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు.


ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు.. ఇక్కడ ఒకే గోవింద నామస్మరణ తప్ప వేరే ఉండటానికి వీల్లేదు.. మిగిలిన విషయాలు త్వరలో మాట్లాడతానని అన్నారు. ప్రజలకోసం 45 సంవత్సరాలుగా ప్రపంచంలో మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ భారతీయులకు అవి అందించాలని ప్రయత్నించానని చెప్పారు. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు వచ్చిందని, భవిష్యత్తులో భారతీయులతోపాటు ప్రపంచంలో అన్ని రంగాల్లో నెం.1 స్థానంలో తెలుగు కమ్యూనిటీ ఉండాలని, ఆమేరకు నా ప్రయత్నం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. తన సంకల్పం ముందుకు తీసుకువెళ్లే శక్తి, సామర్ధ్యం తెలివితేటలు ఇవ్వాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు. కష్టాల్లో ఉన్నపుడు తెలుగు ప్రజలే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా ప్రజలంతా సంఘీభావం చెప్పారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానన్నారు. మరో రెండు మూడు ఆలయాల్లో మొక్కులు చెల్లించాల్సి ఉందని వాటిని పూర్తి చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమాలను ప్రారంభిస్తానన్నారు.

Tags

Read MoreRead Less
Next Story