CBN: అప్పుడు కోడికత్తి.. ఇప్పుడు రాయి దాడి

CBN: అప్పుడు కోడికత్తి.. ఇప్పుడు రాయి దాడి
నాటకాలకు తెరలేపారన్న చంద్రబాబు... చిల్లర పనులు చేయొద్దని హితవు

గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన వైసీపీ నాయకులు ఇప్పుడు రాయి నాటకానికి తెరలేపారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గాజువాక చంద్రబాబు సభలో దుండగులు రాళ్లు విసరగా చిల్లర పనులు చేస్తే ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పేదలకు 2సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్న సీఎం జగన్ ప్రజలకు మాత్రం చిన్న ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. మహిళలను ఆర్థిక శక్తిగా తయారు చేస్తామని, ఆటోడ్రైవర్ల కోసం కొత్త పాలసీ తీసుకొస్తామని తెలిపారు.


ప్రజాగళం సభల్లో భాగంగా పాయకరావుపేట, గాజువాక నియోజకవర్గాల్లో పర్యటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై రాళ్ల దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. గాజువాకలో చంద్రబాబుపై కూడా దుండగులు రాళ్లు విసరగా.. గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ రాళ్లు వేస్తోందని మండిపడ్డారు. తెనాలిలో పవన్‌ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ దళితద్రోహి అని విమర్శించిన చంద్రబాబు... ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో.. మాస్క్‌ అడిగినందుకు దళిత డాక్టర్‌ను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. జగన్‌ తెచ్చిన ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉందనిచంద్రబా బు ఆరోపించారు. మహిళలను ఆర్థికశక్తిగా తయారుచేసి దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం..కొత్త పాలసీ తీసుకొస్తామని తెలిపారు. ప్రపంచస్థాయి పరిశ్రమలను తీసుకొచ్చి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని వివరించారు. ఏపీలో NDA కూటమి విజయం సాధిస్తుందన్న చంద్రబాబు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.

ఐదేళ్లలో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశారు. ప్రశాంతమైన ఈ ప్రాంతాన్ని నేరస్థులకు అడ్డాగా మార్చేశారు. ఉత్తరాంధ్రలో రూ.40వేల కోట్లు దోచేసిన దుర్మార్గుడు ఈ సీఎం. రుషికొండను అనకొండలా మింగేశారు. రూ.500కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టుకున్నాడు. పేద వారి ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. జగన్‌ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయను.. రాని వారికి 2సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తాం. దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని మోదీ ప్రకటించారు. అందులో మన రాష్ట్రానికి దాదాపు 30 లక్షల ఇళ్లు వస్తాయి. నేను వస్తే పరిశ్రమలు వస్తాయి.. జగన్‌ వస్తే గంజాయి వస్తుంది. విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసినా దిక్కులేదు.

పేదోడినని చెప్పుకొనే ఈ ముఖ్యమంత్రి తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. జగన్‌ తెచ్చిన ప్రతి పథకం వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉక్కు పాదంతో తొక్కాలి. ఆకాశమే హద్దుగా ఏపీని అభివృద్ధి చేసే మేనిఫెస్టో తెచ్చాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తాం. తల్లికి వందనం కార్యక్రమం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున, ఏప్రిల్‌ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలు చొప్పున ఇస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story