TDP-JANASENA: అర్ధరాత్రి వరకూ చంద్రబాబు-పవన్‌ చర్చలు

TDP-JANASENA: అర్ధరాత్రి వరకూ చంద్రబాబు-పవన్‌ చర్చలు
సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన తుది కసరత్తు.... సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై వేగం..

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం ప్రత్యర్థి పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో తెలుగుదేశం- జనసేన (TDP - Janasena) సైతం తుది కసరత్తు చేపట్టాయి. పొత్తులో భాగంగా సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి. ఈమేరకు చంద్రబాబు నివాసానికి రెండుసార్లు వచ్చిన పవన్‌...అర్థరాత్రి వరకు సీట్ల మథనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) వేడి మొదలైనా ప్రధాన ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం- జనసేన నుంచి ఇప్పటి వరకు సీట్ల ఖరారుపై ఎలాంటి ప్రకటన రాలేదు. సమయం దగ్గరపడుతుండటం, ఆశావహ అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరిగిపోతుండటంతో...సీట్ల ఖరారుపై చంద్రబాబు (Chandra Babu), పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) దృష్టి సారించారు. చంద్రబాబుతో రెండు దఫాలుగా సమావేశమైన పవన్...ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి? సామాజిక సమీకరణాలేంటి..? సీటు దక్కనివారికి ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు.


గత నెల 13న సంక్రాంతి సందర్భంగా పవన్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. మూడున్నర గంటల పాటు జరిగిన ఆ సమావేశంలో పొత్తుకు సంబంధించిన చాలా అంశాలపై స్పష్టత వచ్చింది. దాని కొనసాగింపుగానే మళ్లీ ఆదివారం ఇరువురు భేటీ అయ్యారు. గత సమావేశంలో లోకేశ్, మనోహర్ పాల్గొనగా...ఈసారి కేవలం చంద్రబాబు, పవన్ మాత్రమే చర్చించుకున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మరోసారి చంద్రబాబు నివాసానికి పవన్‌ వచ్చి సుమారు 40 నిమిషాలపై సీట్ల కేటాయింపు, సర్దుబాటపై చర్చించారు. ఈనెల 8న మరోసారి భేటీ అయి ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు ఎన్నికల ప్రచార వ్యూహాలు, ఇద్దరు కలిసి పాల్గొనాల్సిన బహిరంగ సభలపై నిర్ణయం తీసుకోనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story