AP: కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి

AP: కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తెలుగుదేశం-జనసేన శ్రేణుల భోగి వేడుకలు....చీకటి జీవోలను మంటల్లో వేసి దహనం

'కీడు తొలగాలి-ఏపీ వెలగాలి' అంటూ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తెలుగుదేశం - జనసేన శ్రేణులు భోగి వేడుకలు నిర్వహించాయి. భోగి సంకల్పంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోలను మంటల్లో వేసి నేతలు దహనం చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన జగన్ ను శాశ్వతంగా ఇంటికి పంపే వరకు కార్యకర్తలు, ప్రజలు విశ్రమించొద్దని పిలుపునిచ్చారు.


శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో NTR భవన్ వద్ద నిర్వహించిన భోగి వేడుకల్లో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. వైసీపీ దుర్మార్గ పాలనను బంగాళాఖాతంలో కలిపి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కదలిరావాలని పిలుపునిచ్చారు. విశాఖ MVPకాలనీలోని నివాసం వద్ద మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు భోగి మంటలు వేసి నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్‌ భోగిమంటల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవో కాపీలు వేసి తగులబెట్టారు. NTR జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ భోగి మంటలు వేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అని కార్యకర్తలతో కలిసి నినదించారు. విజయవాడ తెలుగుదేశం కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భోగి వేడుకలు నిర్వహించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య... ప్రజా వ్యతిరేక జీవో కాపీలను మంటల్లో వేసి కాల్చారు.


గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన భోగి వేడుకల్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. ప్లకార్డులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. పిడుగురాళ్లలో యరపతినేని, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్ చీకటి జీవోలను దహనం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం నేత ఉమామహేశ్వర నాయుడు.. అప్రజాస్వామిక జీవోల ప్రతులను భోగిమంటల్లో వేశారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి భోగిమంటల్లో జీవోలు కాల్చివేశారు . కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. కడపలోని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి నివాసం ఎదుట భోగి సంబరాలు జరిపారు. ప్రజా వ్యతిరేక విధానాల పోస్టర్లను మంటల్లో వేశారు.


చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భోగిమంటల్ల్లో ప్రభుత్వ జీవో ఉత్తర్వులను వేసి తగులబెట్టారు. అనంతరం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టార్‌లో చంద్రబాబు, లోకేశ్ సైతం నారావారిపల్లెకు చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story