Vizianagaram: రామతీర్థంలోని బోడికొండపై మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

Vizianagaram: రామతీర్థంలోని బోడికొండపై మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
Vizianagaram: ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడానికి వచ్చినప్పుడే అభ్యంతరాలు చెప్పానని కానీ వాటిని పట్టించుకోకుండా శిలాఫలకం ఏర్పాటు చేయడం ఏంటని నిలదీశారు.

Vizianagaram: రామతీర్థంలోని బోడికొండపై మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతి రాజునే నెట్టేశారు వైసీపీ వర్గీయులు. సంప్రదాయాల్ని ఎందుకు పాటించడం లేదని అడిగినందుకు తీవ్రంగా అవమానించారు.

దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ కోదండ రామ ఆలయ పునర్‌ నిర్మాణం శంకుస్థాపనకు మంత్రులు వస్తున్న సమయంలో.... ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసే పనుల్ని అశోక్‌గజపతిరాజు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడానికి వచ్చినప్పుడే అభ్యంతరాలు చెప్పానని కానీ వాటిని పట్టించుకోకుండా శిలాఫలకం ఏర్పాటు చేయడం ఏంటని నిలదీశారు. ఈ ఆలయాన్ని తమ పూర్వికులు కట్టించారని ఇక్కడ ప్రభుత్వ శిలాఫలాకాలు సరికాదని అన్నారు.

దేవాలయానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు పూర్వం నుంచి రాజవంశీయులే నిర్వహిస్తున్నారని, దానికి విరుద్ధంగా మంత్రులు చేయడం సరికాదని అన్నారు. అక్కడి శిలాఫలకం, పునర్‌నిర్మాణానికి సంబంధించిన బోర్డులను వెనక్కి పంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడున్నవారితో వాగ్వాదం జరిగింది. ఇదే టైమ్‌లో వైసీపీ వర్గీయులు ఆయన్ను తోసేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి ఆ ఉద్రిక్తతల మధ్యే భూమి పూజ పూర్తి చేశారు మంత్రులు.

ఇదే విషయంలో అశోక్‌గజపతి రాజుతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వాగ్వాదానికి దిగారు. ఇదేమీ సర్కస్‌ కాదని, ట్రస్ట్‌ చేయలేకపోతేనే తాము చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఐతే.. ట్రస్ట్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం ఏంటని అశోక్‌ గజపతిరాజు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటకు మాట పెరిగింది. ఈ ఉద్రిక్తల మధ్యే పూజాకార్యక్రమాలు పూర్తి చేశారు. అశోక్‌గజపతిరాజు కూడా పూజలో పాల్గొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని.. ప్రభుత్వ తీరుపై అసహనం వేయక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆలయ మర్యాదలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై కేంద్ర మాజీ మంత్రి, అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కానే కాదని, తమ పూర్వికులు 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయం ఇదని గుర్తు చేశారు. ఇలాంటి చోట ఆనవాయితీల్ని వదిలేసి హడావుడి చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలోనే ఆలయ పునర్‌ నిర్మాణ పనుల కోసం తాను ఇచ్చిన చెక్‌ను కూడా తీసుకోలేదని, ఇప్పుడు కావాలని ఇంకా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆలయ మర్యాదలు, సంప్రదాయాల ప్రకారం కార్యక్రమం జరగడం లేదని ప్రశ్నించడం తప్పా అని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ఈ దేశంలో న్యాయం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. వాటిని ఎండోమెంట్‌ ఉన్నతాధికారులకు పంపిస్తానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 115 దేవాలయాలపై దాడులు జరిగాయని, వాటిపై దర్యాప్తు ఏమైందని కూడా నిలదీశారు.

గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన బోడికొండపై ఉన్న ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. తలను విరగ్గొట్టి పక్కనే ఉన్న కోనేరులో పడేశారు. దీనిపై అప్పట్లోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. కొన్నాళ్ల తర్వాత ధ్వంసమైన రాముడి విగ్రహ స్థానంలో కొత్త ప్రతిమల్ని ప్రతిష్టించేందుకు వాటిని TTD శిల్పులతో తయారు చేయించి తెప్పించారు. వాటిని ఇంకా ప్రతిష్టించాల్సి ఉంది. బోడికొండకు చేరుకునే మెట్ల మార్గం, కోనేరు, ధ్వజస్తంభం, గర్భాలయం, ఆలయ ప్రాకారం ఇలా అంతా పునర్‌ నిర్మాణం చేసేందుకే ఇవాళ శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేశారు.

6 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 3 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఐతే.. ఇప్పుడు ఈ ఆలయ పునర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో అనువంశిక ధర్మకర్తగా ఉన్న తమ కుటుంబాన్ని పక్కకుపెట్టేలా ప్రభుత్వం వ్యవహరించడంపైనే అశోక్‌గజపతి రాజు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ పూర్వికులు కట్టించిన ఆలయానికి మరమ్మతుల పేరు చెప్పి ప్రభుత్వ శిలాఫలకాల్లాంటివి ఎందుకుని ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరాంధ్ర అయోధ్యగా రామతీర్థం క్షేత్రానికి ఎంతో పేరుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ఈ రామతీర్థం సమీపంలోని బోడికొండపైనే ఈ శ్రీరాముడి ఆలయం ఉంది. దాదాపు 400 ఏళ్ల కిందట పూసపాటి వంశీయులు దీన్ని నిర్మిచారు. రామతీర్థంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానికి సమీపంలోనే ఉన్న 800 అడుగుల ఎత్తైన బోడికొండపై ఈ కోదండ రామాలయం ఉంటుంది. ఈ ఆలయానికి ధర్మకర్తలుగా తాము ఉన్నందున.. ఇక్కడ చేసే కార్యక్రమాల్లో సంప్రదాయాలు పాటించాలని అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story