Vishaka: కొండవాలు ప్రాంత జనజీవనం.. వర్షం వస్తే వర్ణనాతీతం..

Vishaka: కొండవాలు ప్రాంత జనజీవనం.. వర్షం వస్తే వర్ణనాతీతం..
గత కొన్నేళ్లుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు పూర్తి భరోసా మాత్రం దక్కలేదు.

విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.వర్షాకాలం వస్తే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.ఎటునుంచి ఏ బండరాయి వచ్చి ఇంటిపైన పడుతుందో ఏ గోడ కులుతుందోనని ఆందోళన చెందుతున్నారు.గత కొన్నేళ్లుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు పూర్తి భరోసా మాత్రం దక్కలేదు.ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతో సరిపడుతుంది తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదు.గాల్లో దీపాల్లా బతుకుజీవుడా అంటూ కొండవాలు ప్రాంతంలోని ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు.ఈ కొండవాలు ప్రాంతాల్లో దాదాపు లక్షన్నర మంది జీవిస్తున్నారు.వీరిలో స్థానికులతో పాటుగా ఇతర ప్రాంతాలు నుంచి వచ్చినవారు ఉంటారు.ఇందులో అధిక శాతం మంది నిరుపేదలే.నగరంలో అధిక అద్దెలు చెల్లించుకోలేక కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ఇల్లును అద్దెకు తీసుకుని ఉంటారు.అయితే వర్షాకాలంలో వీరి బాధలు వర్ణనాతీతం.మట్టి పెళ్లలు విరిగి ఇళ్ల పైకి వస్తుంటాయి.ఇళ్లకు వెళ్ళడానికి సరైన మెట్ల మార్గము కూడా ఉండదు.విద్యుత్ లైన్లు అస్తవ్యస్తంగా ఉంటాయి.తాగునీరు కోసం ఇక్కడి ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం.కొండవాలు ప్రాంతాల్లో రక్షణ చర్యలకు జీవీఎంసీ ప్రత్యేక ప్రణాళికలేమీ అమలు చేయటం లేదు.అంతేకాదు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ అధికారులు భయపెడుతుంటారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాల్కాపురం,గాజువాక,పెందుర్తి,వేపగుంట,గోపాలపట్నం,కంచరపాలెం,హెచ్.బి.కాలనీ,వెంకోజీపాలెం,హనుమంతవాక,ఆరిలోవ,చినగదిలి,పెదగదిలి,మధురవాడ తదితర ప్రధాన ప్రాంతాలతోపాటు లెక్కలేనన్ని కాలనీలు కొండల వాలుల్లోనే ఉన్నాయి.కొండచరియలు ప్రమాదకరంగా మారిన చోట్ల ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదు.దేశంలో అనేక ప్రదేశాలు కొండప్రాంతాల మధ్యే అభివృద్ధి చెందాయి.కొండలపై ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకోవడం అనివార్యం కావడంతో ఆయా రాష్ట్రాలు ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తున్నాయి.ఉన్నంతలో భద్రంగ నిర్మాణాలు చేపడుతున్నాయి.కానీ విశాఖలో ఇది జరగకపోవడంతో.. జనం అవస్థలు పడుతున్నారు.

గతంలో తెన్నేటిపార్క్ సమీపంలో కొండచరియలు విరిగిపడి రహదారి సగభాగం పూర్తిగా మూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. వేపగుంట వద్ద కొండపై ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సంజీవయ్య కాలనీలోని 2015లో బండరాళ్లు విరిగిపడి నలుగురు మృత్యువాత పడ్డారు. పాత డైరీఫారం దగ్గరలోని సుందరనగర్ కొండ ప్రాంతంలో ఇంటి నిర్మాణం కోసం గోతులు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు చనిపోయారు. హనుమంతువాక వంటి ప్రాంతాలలో నివాసం ఉంటున్నవారు తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు ఇక్కడి స్థానికులు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే ప్రభుత్వం స్పందిస్తుంది తప్ప కొండవాలు ప్రాంతాల్లో శాశ్విత పరిష్కరం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. వర్షాకాలం కావడం తో కొండవాలు ప్రాంతాలలో మరిన్ని ప్రమాదాలు జరుగుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలను అరికట్టడానికి శాశ్విత పరిష్కరం చూపించాలని అవసరం ఉన్న చోట రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story