CAG REPORT: సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం

CAG REPORT: సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం
జగన్‌ ప్రభుత్వ తీరును తూర్పారబట్టిన కాగ్‌... అమరావతిని నాశనం చేశారని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యంగ విరుద్ధమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చిచెప్పింది. రాజ్యాంగేతర వ్యవస్థగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాగే 2019 మే నుంచి రాజధాని అమరావతి అభివృద్ధిలో అనిశ్చితి నెలకొందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ ఆడిట్ నివేదికల్ని సమర్పించింది. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును కాగ్‌ తప్పుపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును కాగ్‌ తప్పుపట్టింది. వార్డు కమిటీలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం వికేంద్రీకరణ పాలన కోసం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందని ఆడిట్ నివేదికలో కాగ్ పేర్కొంది. 2019 జులైలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం... స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమేనని కాగ్‌ తేల్చిచెప్పింది. స్వపరిపాలన సాధించేందుకు ప్రజాప్రతినిధులతో కూడిన వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.


ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సీఎం జగన్‌ ఎలా నాశనం చేశారో కాగ్‌ నివేదిక కళ్లకు కట్టింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేయడంతో... అప్పటిదాకా ఖర్చుపెట్టిన వేల కోట్ల ప్రజాధనం వృథా అయినట్టు తెలిపింది. రాజధాని నిర్మాణానికి సాయం కావాలని కేంద్రాన్ని ఒక్కమాట కూడా అడగలేదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వం 2019లో పంపిన D.P.Rలలో కొన్ని సవరణలు చేసి పంపమంటే.... తీరిగ్గా 2022 జూన్‌లో స్పందించిందని ఆక్షేపించింది. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.... రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి తదుపరి సాయం అందలేదని ఎండగట్టింది. భూములిచ్చిన రైతులకు జరిగిన నష్టాన్ని కాగ్ నివేదికలో ప్రస్తావించింది. ప్రజావేదిక కూల్చివేత, అంబేడ్కర్‌ స్మృతివనం నిలిపేయడం వల్ల నిధులు వృథా అయ్యాయని స్పష్టం చేసింది.


2014 జూన్‌ నుంచి.... 2021 సెప్టెంబరు వరకు రాజధాని అమరావతికి సంబంధించిన ఆడిట్‌ వివరాల్ని నివేదికలో పొందుపరిచింది. అమరావతికి 2015 మార్చి నుంచి 2017 ఫిబ్రవరి మధ్య కేంద్రం 15వందల కోట్లు అందజేసినట్లు వెల్లడించింది. వివిధ దశల్లో రాజధాని నిర్మాణానికి లక్షా 9 వేల 23 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన గత ప్రభుత్వం... 39వేల 937 కోట్ల కోసం 2018 ఆగస్టులో నీతి ఆయోగ్‌కి 33 D.P.Rలు, 22వేల 686 కోట్లకు 2018 డిసెంబరులో మరో 14 D.P.Rలు అందజేసిందని తెలిపింది. తొలివిడతలో ఇచ్చిన 33 D.P.Rలను 2019 ఏప్రిల్‌లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖకు పంపిన నీతిఆయోగ్‌... సాధ్యాసాధ్యాలు పరిశీలించి అభిప్రాయం చెప్పాలని కోరినట్లు పేర్కొంది. 2019 మేలో ఏపీ పురపాలకశాఖకు అభ్యంతరాల్ని తెలియజేసిన కేంద్ర ప్రజా పనుల విభాగం సవరించిన D.P.Rలు పంపాలని సూచించినట్లు వివరించింది. ఎంతకీ పట్టించుకోకపోవడంతో 2022 మేలో నీతిఆయోగ్‌ జగన్‌ ప్రభుత్వానికి ఆ విషయాన్ని గుర్తుచేయగా2022 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించినట్లు కాగ్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story