Maddireddy Kondreddy: సొంత పార్టీ నేతపై ప్రతీకారం.. వైసీపీ లీడర్ మద్దిరెడ్డి కొండ్రెడ్డి అరెస్ట్..

Maddireddy Kondreddy: సొంత పార్టీ నేతపై ప్రతీకారం.. వైసీపీ లీడర్ మద్దిరెడ్డి కొండ్రెడ్డి అరెస్ట్..
Maddireddy Kondreddy: వైసీపీ.. ఇప్పుడు ప్రశ్నించిన మరో సొంతపార్టీ నేతపై ప్రతీకారానికి దిగింది.

Maddireddy Kondreddy: ప్రశ్నించారా.? ఇక అంతే. ఇది ఏపీలో పరిస్థితి. పార్టీలో నేతల తీరును ప్రశ్నించినందుకు ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావుగుప్తాపై అరాచకానికి ఒడిగట్టిన వైసీపీ.. ఇప్పుడు ప్రశ్నించిన మరో సొంతపార్టీ నేతపై ప్రతీకారానికి దిగింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిపై ఆరోపణలు చేసిన వైసీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డిని నూతన సంవత్సరం రోజునే అరెస్ట్‌ చేసి తన మార్క్‌ చూపించింది.

2008లో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ ఏడుగురి కొండ్రెడ్డి మోసం చేశారని.. తంబళ్లపల్లి ఎస్‌ఐ కేసు బుక్‌ చేసి ఆయన్ను హుటాహుటిన అరెస్ట్‌ చేశారు. 2008లో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని డబ్బు తీసుకుని.. ఎమ్మార్వో ఫోర్జరీ సంతకాలతో మోసం చేశారని అభియోగం నమోదైంది. అప్పటి బాధితులు ప్రస్తుత ఎమ్మార్వోను ఆ పట్టాలు ఇవ్వాలని సంప్రదించగా.. అవి ఎమ్మార్వో ఫోర్జరీ సంతకాలు అని.. దానిపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మార్వో.. తంబల్లిపల్లి ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు.

దీనిపై ఐపీసీ 467, 468, 471, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంటనే మద్దిరెడ్డి కొండ్రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని కొండ్రెడ్డి భార్య, వైసీపీ జడ్పీటీసీ గీత ఆరోపించారు.పోలీసులు బలవంతంగా ఇంటి నుంచి కొండ్రెడ్డిని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసే అరాచకాలు, అక్రమాలను బయటపెడితే అరెస్టులు చేస్తారా?అని గీత ప్రశ్నించారు.

పార్టీ కోసం కష్టపడితే అరెస్ట్లు చేయించి హింసిస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే.. రాజంపేట పార్లమెంట్‌ రైతు విభాగం అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి.. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిపై ఆరోపణలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తే అక్రమ కేసులు పెడతారా అంటూ ధ్వజమెత్తారు. కష్టపడి పనిచేస్తే వేధింపులు, అవమానాలే మిగిలాయని దుయ్యబట్టారు.

పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి హఠావో.. తంబళ్లపల్లి బచావో అంటూ నినదించారు. తంబళ్లపల్లిలో ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని.. భూకబ్జాలు, దౌర్జన్యాలు, ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్చగా జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి.. పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిపై ఈ ఆరోపణలు చేశారో లేదో చకచక పరిణామాలు మారిపోయాయి.

2008లోని ఇళ్లపట్టాల కేసు ఇప్పుడు బయటకు రావడం.. ఆయన్ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపడం అంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది. ఇప్పుడు ఈ పరిణామాలపై వైసీపీ జెడ్పీటీసీగా ఉన్న కొండ్రెడ్డి భార్య గీత ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణ హానీ ఉందని.. అరాచకాలు, అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా.? అని నిలదీస్తున్నారు.

అక్రమ కేసులు పెట్టి తన భర్త కొండ్రెడ్డిని అరెస్ట్‌ చేశారని.. ఇంటికొచ్చిన పోలీసులు తన భర్తను ఈడ్చుకుంటూ వెళ్లారని తెలిపారు. మదనపల్లె సబ్‌జైల్‌లో పెద్దిరెడ్డి అనుచరులు కొండ్రెడ్డిపై దాడి చేసే అవకాశం ఉందని.. పార్టీ కోసం కష్టపడితే అరెస్ట్‌ చేసి చంపేస్తారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story