భూములను కాజేయడంలో వైసీపీ నేతలు మాస్టర్‌ డిగ్రీ

భూములను కాజేయడంలో వైసీపీ నేతలు మాస్టర్‌ డిగ్రీ
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అనుచరులు ఓ ఆకు ఎక్కువే చదివారని ఉరవకొండ వాసులు అంటున్నారు.

ప్రభుత్వ భూములను కాజేయడంలో వైసీపీ నేతలు మాస్టర్‌ డిగ్రీ చేసినట్లు కనిపిస్తున్నారు.అందులోనూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అనుచరులు ఓ ఆకు ఎక్కువే చదివారని ఉరవకొండ వాసులు అంటున్నారు.కబ్జాలలో కూడా తమ ముందుచూపు ను చూపించారు.తమ పేర్లపై పట్టాలను పాత తేదిల్లోనే పొందారు. భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో భూమిని చదునుచేసి,కంచెలు ఏర్పాటు చేసి లేఅవుట్లు వేసేసి అమ్ముకునే ప్రయత్నాల్లో చాలా బిజీ అయిపోయారు.నిన్న మొన్నటి వరకు భూ కబ్జాలలో మాజీ ఎమ్మెల్యే కొడుకు పేరు బాగా ప్రచారంలో ఉంటే ఇప్పుడు ఆయన అనుచరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఇక అనంతపురం రూరల్ మండలంలోని కామారుపల్లి గ్రామంలోని అన్నీ శోత్రియం భూములే. అయితే విచిత్రంగా 28వ సర్వేనెంబర్‌లో దాదాపు 15ఎకరాల 42 సెంట్లు మాత్రమే ప్రభుత్వ భూమిగా మారిందన్న విమర్శలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి.మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి అనుచరులు..వీరన్న కు 28/1 సర్వే నెంబర్‌లో 5 ఎకరాల 17 సెంట్లు.రమణకు 28/2 సర్వే నెంబర్ల్‌లో 5 ఎకరాల 17 సెంట్ల డి పట్టా మంజూరు చేశారు రెవిన్యూ అధికారులు అలాగే మరొకరికి ఐదు ఎకరాలు కేటాయించారు. అయితే స్థానికులకు కాకుండా ఎక్కడో ఉన్నవారికి భూములు ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎకరా యాభై లక్షలకు పైగా ధర పలుకుతుండటంతో ఆక్రమిత భూమిలో ముళ్ళపొదలను తొలగించి, భూమిని చదును చేసుకుని,కంచె వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు సాగులో ఉన్న గ్రామస్తులు ఈ పనులను అడ్డుకోవడంతో పాటు స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఫిర్యాదు చేసిన రైతులపైనే పోలీసులు జులుం పదర్శిస్తున్నారు. డాక్యుమెంట్లతో స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేస్తున్నారు.

మరోవైపు శోత్రియం భూములు ఆయా గ్రామంలో ఉన్న ఆలయ ధూప దీప నైవేద్యాల అవసరాల కోసం ఆలయ కమిటీలకు కేటాయిస్తారు. కామారుపల్లిలో ఆ భూములపై హక్కుల కలిగిన వారు గ్రామం వదిలి వెళ్లిపోవడంతో వాటిపై కబ్జాదారుల కన్ను పడింది.అయితే ఆ భూములు శోత్రియంవి కాకుండా డిపట్టా భూములుగా చూపిస్తున్నారు రెవిన్యూ అధికారులు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే భూములను అప్పణంగా కాజేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు తీవ్రంగా ప్రతి ఘటించారు.గతంలో ఇదే గ్రామ సర్పంచ్ గా వ్యవహరించిన వ్యక్తి అప్పట్లో కబ్జాదారులను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు.కానీ ప్రస్తుతం ఆయనే దగ్గరుండి వారికి వంత పాడుతుండడంతో గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story