YS Jagan Cases: జగన్‌ కేసులు మళ్లీ మొదటికి!

YS Jagan Cases: జగన్‌ కేసులు మళ్లీ మొదటికి!
న్యాయమూర్తి బదిలీ, మొదటికొచ్చిన డిశ్చార్జి పిటిషన్ల విచారణ

సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చింది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడించాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ కావడంతో పిటిషన్లు రీఓపెన్ చేశారు. డిశ్చార్జి పిటిషన్లను తేల్చేందుకు హైకోర్టు ఏప్రిల్ 30 వరకు గడువు విధించినప్పటికీ అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం చేయలేదని జడ్జి తెలిపారు. గడువులోగా తీర్పు ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆయన లేఖ రాశారు. సీబీఐ, ఈడీ కేసుల్లోని 130 డిశ్చార్జి పిటిషన్లపై కొత్త జడ్జి మళ్లీ వాదనలు మొదటినుంచి విననున్నారు.

ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఇప్పట్లో తేలేలా లేదు. వాయిదాలపై వాయిదాలతో ఏళ్లతరబడి సాగుతున్న ఈ కేసు చివరికి వచ్చినట్లే వచ్చి మళ్లీ మొదటికొస్తోంది. తాజాగా సీబీఐ కోర్టు జడ్జీ బదిలీ కావడంతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటి కొచ్చింది. నేడు రిలీవ్‌ కానున్న సీబీఐ కోర్టు జడ్జి CH.రమేశ్‌బాబు...అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం చేయలేకపోయినట్లు వెల్లడించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11, ఈడీ 9 ఛార్జిషీట్లు వేశాయి. కేసుల నుంచి తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు సహా నిందితులు సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేశారు. 2013 నుంచి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లు ఇప్పటికీ తేలడం లేదు. సుదీర్ఘ వాదనలు కొంత వినగానే జడ్జీలు బదిలీ కావడం...కొత్త జడ్జీ మళ్లీ మొదటి నుంచి వినడం పరిపాటిగా మారింది. ఇలా పదకొండేళ్లలో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న జడ్జి రమేష్ బాబు 2022 మే 4 నుంచి సుదీర్ఘంగా వాదనలు వినడంతో విచారణ దాదాపుగా కొలిక్కి వచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టు చొరవతో..డిశ్చార్జి పిటిషన్లను ఫిబ్రవరి 15 నాటికి తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే వాదనలు పూర్తయినప్పటికీ.. సుమారు 13వేల పేజీలు పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును సీబీఐ కోర్టు కోరింది. హైకోర్టు పెంచిన గడువు ఏప్రిల్‌ 30తో ముగిసిపోయింది.

మంగళవారం తీర్పు వెలుపడవచ్చునని అందరూ భావించిన తరుణంలో...తన అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం చేయలేకపోయినట్లు న్యాయమూర్తి రమేష్ బాబు హైకోర్టుకు లేఖ రాశారు. జడ్జి రమేష్ బాబు హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా టి.రఘురాంను నియమించారు. రమేశ్‌బాబు నేడు రిలీవ్‌కానుండటంతో డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు కొత్త జడ్జీ మళ్లీ మొదటి నుంచి విననున్నారు.దీంతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మే 15కి వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story