SHARMILA: అవినాష్‌రెడ్డికి షర్మిల సూటి ప్రశ్నలు

SHARMILA: అవినాష్‌రెడ్డికి  షర్మిల సూటి ప్రశ్నలు
మీ కాల్‌ రికార్డ్స్‌... నిందితుల కాల్‌ ఫోన్‌ రికార్డ్స్‌తో ఎందుకు మ్యాచ్‌ అయ్యాయ్‌

ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు YS షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆమె బీజేపీకి బానిస అయిన జగన్ YSR వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ముస్లింలపక్షాన లేరని ఆరోపించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా కడప స్టీల్ గురించి మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కడప స్టీల్ ప్లాంట్ ను జగన్ శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చారని, మూడుసార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలు చేసే వారికి ఓటు వేయొద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు.


‘మేము వివేకానంద హత్య గురించి మాట్లాడుతుంటే అవినాష్‌రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావటం లేదు. మీరు త్యాగమూర్తి అయితే హంతకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? మీ కాల్ రికార్డ్స్, హంతకుల ఫోన్ రికార్డ్స్ తో ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి. హత్య మీరు చేయకపోతే సీబీఐ విచారణ ఎందుకు వద్దు అన్నారు. నేను వైఎస్ షర్మిలా రెడ్డి కాదట... నేను వైఎస్‌ కి పుట్ట లేదట. వివేకాను సునీతా రెడ్డి హత్య చేయించింది అని నిందలు మోపారు. హంతకులను చట్టసభలకు పంపొద్దని నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము బురద చల్లుతున్నామని అంటున్నారు. ఇన్ని మాటలు చెప్పే బదులు కేసుతో సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా. గూగుల్ మ్యాప్స్‌కి, మీకు సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా. సీబీఐ విచారణ అంటే ఎందుకు భయపడ్డారు చెప్పండి. ఇల్లంతా రక్తం ఉంటే ‘హార్ట్ అటాక్’తో చనిపోయారు అని ఎందుకు అబద్దం ఆడారో చెప్పండి’’

‘‘ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మన నాయకులు. ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి కోసం నేను ఎంపీ సీటు వదులుకున్నా. వివేకా నన్ను పోటీ చేయాలని అడిగితే ‘వద్దు’ అని చెప్పా. నేను ఎంపీ సీట్ కావాలనునుకుంటే ఆరోజే వచ్చేది. అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచిందే నేను. జగన్ కోసం 3,200 KM పాదయాత్ర చేశా. ఒక్కరోజు కూడా పదవి కావాలని అడగలేదు. ఈ రోజు కనీసం కనికరం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. సునీతను, నన్నూ అవమానిస్తున్నారు. అహంకారంతో మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ వివేకా నాకు చిన్నాన్న. నన్ను ఎత్తుకొని పెంచారు. ఆనాడు ముందుచూపుతోనే నన్ను కడప ఎంపీగా పోటీ చేయాలని అడిగారు. నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. వివేకా మాట విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కావు. వివేకా హత్య జరిగి 5 ఏళ్లు దాటింది. హత్య చేసిన వాళ్లకు సీట్ ఇవ్వడం వల్లే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. ప్రజలు నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా’’ అని షర్మిల అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story