YSRCP: 11వ జాబితా విడుదల చేసిన వైసీపీ..

YSRCP: 11వ జాబితా విడుదల చేసిన వైసీపీ..
3 స్థానాలకు ఇన్‌చార్జ్‌లను నియమించిన జగన్

తాడేపల్లి – త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జుగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జుగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ ఇంఛార్జుగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల నియామకానికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం మొత్తం 10 జాబితాలను విడుదల చేయగా.. తాజాగా శుక్రవారం (మార్చి 8న) పదకొండవ జాబితాను రిలీజ్ చేసింది. అందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాను ప్రకటించింది. ఈసారి జాబితాలో ప్రధానంగా కర్నూలు ఎంపీ ఉత్కంఠకు వైసీపీ తెరతీసింది. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసింది. కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్ గా మేయర్ బి.వై. రామయ్యను నియమించింది. వాల్మీకి సామాజిక వర్గానికే ఈసారి కూడా వైసీపీ సీటును కేటాయించింది. అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా రాపాక వరప్రసాద్‌ను నియమించగా, రాజోలు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకూ విడుదల చేసిన 11 జాబితాల్లో 73 అసెంబ్లీ స్థానాలు, 23 పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌ల జాబితాలను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది.

ఇటీవల, అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, మచిలీపట్నం ఎంపీ బరి నుంచి సింహాద్రి రమేశ్ ను బరిలో దించుతున్నట్టు వైసీపీ హైకమాండ్ నుంచి ప్రకటన వెలువడింది. అయితే, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సింహాద్రి చంద్రశేఖర్ విముఖత వ్యక్తం చేయడంతో, అభ్యర్థులను అటూ ఇటూ మార్చారు. సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం నుంచి ఎంపీగా, సింహాద్రి రమేశ్ ను అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్టు తాజా జాబితా ద్వారా ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story