Andhra Pradesh: రాష్ట్రం మొత్తం ఎటుచూసినా దోపిడీ

Andhra Pradesh: రాష్ట్రం మొత్తం ఎటుచూసినా దోపిడీ
రాష్ట్రంలో ఎటు చూసినా కొండలు, గుట్టలకు గుండు కొట్టే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది

ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలో ఎటు చూసినా కొండలు, గుట్టలకు గుండు కొట్టే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. విశాఖ నుంచి మొదలు పెడితే.. అనంతపురం వరకు ఏ కొండనూ వైసీపీ నాయకులు వదలట్లేదు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వేస్తున్నారు. పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వడంతో కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి పరిధిలోని గుట్టను తవ్వి ఎర్రమట్టిని కొల్లగొడుతున్నారు.

స్థానిక వైసీపీ నాయకుడొకరు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి రోజూ వందలాది టిప్పర్లతో ప్రైవేట్‌ లేఅవుట్లకు విక్రయిస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో కొద్దిరోజులకే గుట్ట కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఆ నాయకుడు ఇంతటితో ఆగలేదు.. మట్టి తరలించగా చదునైన ప్రాంతంలో మామిడి చెట్లు పెంచినట్లు రికార్డులో చూపి ఉపాధి నిధులు కాజేశారు.

భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సుయాత్ర సోమవారం రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో గుట్టపై అనుమతి లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాలను పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పరిశీలించారు. వైసీపీ నాయకుల అక్రమ తవ్వకాలతో కొండలు, గుట్టలు కూడా బావులు, చెరువుల్లా మారిపోతున్నాయన్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరులు వాటాలు వేసుకుని ప్రకృతిని దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సామాన్యులు ఒక ట్రాక్టరు మట్టి తరలిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైసీపీ నాయకులు విచ్చలవిడిగా ప్రకృతి దోచుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకునే ధైర్యం అధికారులకు ఉందా అంటూ పరిటాల సునీత, శ్రీరామ్‌ సెల్ఫీ ద్వారా ఛాలెంజ్‌ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story