AP: ఏలూరులో మితిమీరిపోతున్న వైసీపీ నాయకుల ఆగడాలు

AP: ఏలూరులో మితిమీరిపోతున్న వైసీపీ నాయకుల ఆగడాలు

ఏలూరులో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎంతలా అంటే ఆఖరికి స్వచ్ఛంద సంస్థలను కూడా వదలడం లేదు అధికార పార్టీ నాయకులు. సేవా కార్యక్రమాలలో ముందున్న ఫ్లాష్ సంస్థపై వైసీపీ నాయకుల కక్ష సాధిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అరాచకం కారణంగా లక్షలాది రూపాయల విలువైన దహన సంస్కారాల సామాగ్రికి... స్వచ్ఛంద సంస్థకు నిలువు నీడ లేకుండా పోయింది.


ఏలూరులోని అశోక్ నగర్ స్మశాన వాటికలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ నిర్మించిన షెడ్డును... దహన సంస్కారాలకు ఉపయోగించే సామాగ్రిని, మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్స్‌ను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. అడ్డంకులు ఎదురైనా నిలువ నీడ లేకపోయినా... స్మశాన వాటిక వద్ద ఎండకు వానకు బెదరకుండా ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ తమ సేవలను కొనసాగిస్తూనే ఉంది.. అయితే స్మశాన వాటిక వద్ద ఉన్న షెడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వారి పట్ల వైసీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు... ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.


2004లో ప్రారంభమైన ఫ్లాష్ సంస్థ సేవలు ఎంతో మంది అనాధ శవాలకు దహన సంస్కారాలు చేసింది. అంతే కాకుండా కొవిడ్‌ సమయంలో వందలాది మృతదేహాలను స్వయంగా ఫ్లాష్ వాహనంలో తరలించి.. ఆ సంస్థ వాలంటీర్లే దహన సంస్కారాలు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు సేవా సంస్థపై దాడులు చేయడం వల్ల పేద ప్రజలకు సేవ చేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. దాదాపు 16 ఫ్రీజర్స్ ఉంటే..మున్సిపల్ అధికారుల చర్యతో అందులో సగానికి పైగా పాడైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు...ఉన్న కొన్ని సామాగ్రితోనే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ సేవా ర్యక్రమాలు కొనసాగిస్తోంది.


గతంలో ఏలూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఫ్లాష్ సేవలు అందించేవారు. ఇప్పుడు కనీసం మనిషి చనిపోతే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమం చేయడానికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకుల తీరుతో దళారులు రాజ్యమేలుతున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఫ్రీజర్స్ పాడైపోతే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా రెండు ఫ్రీజర్స్ ను అందజేసింది.

పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థపై వైసీపీ నాయకులు కావాలనే టార్గెట్‌ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరుకు చెందిన ఓ వైసీపీ ప్రజాప్రతినిధి అశోక్ నగర్ స్మశాన వాటికలో నిర్మించిన షెడ్‌ను ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్న సామాగ్రిని మున్సిపల్ గ్రౌండ్‌కు తరలించారని అంటున్నారు. అయితే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడంతో ఫ్రీజర్స్‌ను సంస్థ కార్యాలయం వద్ద వదిలి వెళ్లారు. అప్పటినుంచి అశోక్ నగర్ స్మశాన వాటిక వద్దే ఆరు బయట సామాగ్రిని భద్రపరిచి సేవలను కొనసాగిస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ సేవలను గుర్తించి వారికి అన్ని విధాల సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story