ysrcp activist murder: జగన్ సొంత జిల్లాలో.. వైసీపీ కార్యకర్త హత్య

ysrcp activist murder: జగన్ సొంత జిల్లాలో.. వైసీపీ కార్యకర్త హత్య
బురఖాలు ధరించిన వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. శ్రీనివాసరెడ్డిని కత్తులతో నరికేశారు


సీఎం జగన్ సొంత జిల్లాలో.. అదీ వైసీపీ కార్యకర్త మర్డర్‌ సంచలనం సృష్టిస్తోంది. కడపలో వైసీపీ కార్యకర్త శ్రీనివాసరెడ్డి దారుణ హత్య ప్రజల్లో భయాందోళన కల్గిస్తోంది. ఐతే.. ఈ హత్యను అధికార పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఈ హత్యను లోకేష్‌తో ముడిపెట్టడంపై టీడీపీ భగ్గుమంటోంది. బురఖాలు ధరించిన వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. శ్రీనివాసరెడ్డిని కత్తులతో నరికేశారు. వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డి కడప మారుతీనగర్‌ ఆంజనేయగుడి సమీపంలో నివాసముంటున్నారు.

ఆర్టీసీ ఛైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి ప్రధాన అనుచరుడిగా, వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఈయనకు మరో వర్గానికి చెందినవారితో భూతగాదాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిన్న ఉదయం 6.50కి ఆయన జిమ్‌కు వెళ్లి, ఇంటికి బయల్దేరుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బురఖాలు ధరించి కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ మహిళ ఘటనను చూసి తన వాహనాన్ని అక్కడే ఉంచి భయంతో దూరంగా వెళ్లింది. హంతకుడి చేతిలోంచి కత్తి జారిపోయి రోడ్డుపై పడిపోయింది. ఆమె ధైర్యం చేసి ఆ కత్తిని దూరంగా పడేశారు. కత్తిపోట్లకు గురైన శ్రీనివాసరెడ్డి పరుగులు తీస్తూ కుప్పకూలిపోయారు. ఆయనను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. కడప డీఎస్పీ షరీఫ్‌, వన్‌ టౌన్‌ సీఐ నాగరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బురఖాలు ధరించిన ఇద్దరు బైక్‌పై వచ్చి నరికినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. శ్రీనివాసరెడ్డి సన్నిహితులే ఈ హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తిపై శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు.

శ్రీనివాసరెడ్డి హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరు లొంగిపోయినట్లు ప్రచారం జరిగింది. హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ప్రతాప్‌రెడ్డి, ఓబులేసు, మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కడప, పరిసరాల్లో మృతుడు శ్రీనివాసరెడ్డి, ప్రతాప్‌రెడ్డి భూదందాలు సాగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో వాటాల పంపిణీ వివాదాలే హత్యకు దారితీసినట్లు ప్రచారం సాగుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతాప్‌రెడ్డి వారం కిందే తన భార్యను ఊరు పంపేసి, అద్దె ఇల్లు ఖాళీ చేసినట్లు తెలిసింది. శ్రీనివాసరెడ్డి తనను హత్యచేయిస్తాడని.. ముందుగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు. దాడి చేసినవారికి దూరం నుంచి కొందరు సాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అదుపులో ఉన్న ముగ్గురు నిందితుల ద్వారా సమగ్రంగా వివరాలు రాబట్టే యత్నం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి హత్య ఘటనలో అయిదుగురిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు ప్రతాప్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

హత్య చేసినవారు ఎవరన్నదానిపై కొన్ని అనుమానాలున్నాయన్నారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి. వారి వెనక ఎవరున్నారనేది ముఖ్యం.. లోకేశ్‌ కడప పర్యటన తర్వాతే హత్య జరిగిందంటూ కామెంట్ చేశారు. ఐతే.. రవీంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హత్యకు లోకేష్‌తో సంబంధమేంటని నిలదీశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు క్షీణించాయని ...జిల్లాలో ఇలాంటి భయానక పరిస్థితులుంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు గమనించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story