cryptocurrency: క్రిప్టోకరెన్సీని బ్యాన్‌ చేస్తే పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి ఏంటి?

cryptocurrency: క్రిప్టోకరెన్సీని బ్యాన్‌ చేస్తే పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి ఏంటి?
cryptocurrency: క్రిప్టోను నిషేధించవచ్చనే ఆందోళనల నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలు భారీగా పతనమయ్యాయి.

cryptocurrency: ఇండియాలో క్రిప్టోకరెన్సీని నిషేధిస్తారా? బ్యాన్‌ చేస్తే ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి ఏంటి? దేశంలో క్రిప్టోకరెన్సీపై 75వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేశారు. ఆ పెట్టుబడులన్నీ ఏం కావాలి? దేశంలో క్రిప్టోలపై ఇన్వెస్ట్‌ చేసిన 10 కోట్ల మంది ప్రశ్నలివి. కేవలం ఇండియన్ ఇన్వెస్టర్లే కాదు.. భారత్‌ తీసుకోబోయే నిర్ణయంపై ప్రపంచం కూడా ఎదురుచూస్తోంది.

ఎందుకంటే, క్రిప్టో ఇన్వెస్టర్లలో ప్రపంచంలోనే ఇండియా టాప్. అమెరికాలో రెండున్నర కోట్ల మంది పెట్టుబడి పెడితే.. మనదగ్గర 10 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ పతనం అవడానికి కారణం కూడా.. భారత్‌ వీటిని నిషేధిస్తుందా అన్న అనుమానాలు ఉండడమే.

వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ బిల్లు ద్వారా క్రిప్టోను నిషేధించవచ్చనే ఆందోళనల నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలు భారీగా పతనమయ్యాయి.

అయితే, క్రిప్టోను పూర్తిగా నిషేధించదనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. కాకపోతే, క్రిప్టోపై భారత ప్రభుత్వం పూర్తిస్థాయి నియంత్రణ కోరుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రిప్టో దుర్వినియోగం కాకుండా, ముఖ్యంగా ఉగ్రవాదులు, బ్లాక్‌మనీని వెనకేసుకునే వారికి అవకాశంగా మారకుండా రెగ్యులేషన్ మెకానిజం అమలు చేయాలని భావిస్తోంది భారత్.

పైగా క్రిప్టో హవా పెరిగితే.. దేశ కరెన్సీ అయిన రూపాయికి ప్రమాదమని, ట్యాక్స్‌ సిస్టమ్‌ కూడా డేంజర్‌ జోన్‌లో పడుతుందని కొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగని నిషేధిస్తే మాత్రం బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో ఇండియా వెనకబడిపోతుందని చెబుతున్నారు. అసలు వీటిపై ఏం చేయాలనే దానిపైనే తీవ్ర కసరత్తు జరుగుతోంది.

అదృష్టం ఏంటంటే.. క్రిప్టోలపై నిషేధం విధించాలా, ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలంటూ వేసిన కమిటీలో నిష్ణాతులు ఉన్నారు. క్రిప్టోను ఆపడం కష్టమని చాలా స్పష్టంగా చెప్పిన నిపుణులు.. వీటిని నియంత్రిస్తే చాలని ప్రభుత్వానికి చెప్పారు. సో, క్రిప్టోలపై సానుకూల నిర్ణయమే రావచ్చని భావిస్తున్నారు.

క్రిప్టో కరెన్సీలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోల విలువ గాలి బుడగల్లాంటిదేనని అన్నారు. వేలం వెర్రిగా కొనడం వల్లనే క్రిప్టోల విలువ పెరుగుతోంది తప్ప శాశ్వత విలువ లేదని కామెంట్ చేశారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న క్రిప్టో కరెన్సీల్లో ఏవో ఒకటి రెండు లేదా అతి కొద్ది కరెన్సీలు మాత్రమే మిగులుతాయని, మిగిలిన అల్లాటప్పా క్రిప్టో కరెన్సీలన్నీ అంతరించిపోతాయని చెప్పుకొచ్చారు. పైగా క్రిప్టోలను చిట్టీలతో పోల్చారు. జనం నుంచి డబ్బులు తీసుకుని, కొన్ని చిట్‌ఫండ్‌ సంస్థలు టోపీ పెట్టినట్టే క్రిప్టోకరెన్సీల నిర్వాహకులూ టోపీ పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే క్రిప్టోల్లో ఇన్వెస్ట్‌ చేసిన వాళ్లంతా నిండా మునగడం ఖాయమన్నారు.

ఏదేమైనా క్రిప్టోలపై భారత్‌ ఏ డెసిషన్ తీసుకుంటుందోనన్న భయంతో క్రిప్టో కరెన్సీలు పతనమయ్యాయి. బిట్ కాయిన్, ఎథేరియం సహా అన్ని క్రిప్టోలు భారీగా పడిపోయాయి. బిట్ కాయిన్ అయితే ఓ సమయంలో 56వేల డాలర్ల దిగువకు పడిపోయింది.

క్రిప్టోను నియంత్రించే విషయంలో భారత్‌ హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని క్రిప్టో కరెన్సీ పరిశ్రమ విజ్ఞప్తి చేస్తోంది. బిట్‌కాయిన్‌, ఎథేరియమ్‌ వంటి డిమాండ్‌ ఉన్న క్రిప్టోలను ఎక్స్ఛేంజీల్లో క్రయవిక్రయాలకు వీలుకల్పించాలని, పన్ను విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు క్రిప్టోలపై భారత విధానం ఏంటో తెలిసే వరకు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story