loverstory: రేవంత్, మౌనికల అద్భుతమైన ప్రేమకథ.. లవ్‌స్టోరీ మూవీ రివ్యూ

loverstory: రేవంత్, మౌనికల అద్భుతమైన ప్రేమకథ.. లవ్‌స్టోరీ మూవీ రివ్యూ
తెలుగులో ఇలాంటి దర్శకులు తక్కువ. ఆ తక్కువలోనూ ఎక్కువ ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

రివ్యూ : లవ్ స్టోరీ

తారాగణం : నాగచైతన్య, సాయపల్లవి, రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, ఉత్తేజ్, దేవయాని తదితరులు

ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్

సంగీతం : పవన్ సిహెచ్

సినిమాటోగ్రఫీ : విజయ్ సి కుమార్

నిర్మాతలు : నారాయణదాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు

దర్శకత్వం : శేఖర్ కమ్ముల

రిలీజింగ్ : 24.09.2021

పాండమిక్ తర్వాత సినిమా థియేటర్స్ కు ఫ్రైడేస్ అన్నీ డ్రై డేస్ గా మారాయి. గత రెండు నెలలుగా కొన్ని సినిమాలు వస్తున్నా.. థియేటర్స్ కలర్ ఫుల్ గా మాత్రం లేవు. అందుకు కారణం.. ఆడియన్స్ ను రప్పించే సత్తా ఉన్న సినిమాలు లేకపోవడమే. సెకండ్ వేవ్ తర్వాత ఆ సత్తా తమకుందని వచ్చింది లవ్ స్టోరీ మూవీ. ఇవాళ విడుదలైన ఈ మూవీకి ముందు నుంచీ విపరీతమైన బజ్ ఉంది. మరి ఆ బజ్ ను సినిమా అందుకుందా..? శేఖర్ కమ్ముల నమ్మకం నిజమైందా..?

ఏ సినిమా అయినా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికే అంటారు. కానీ కొంతమంది మేకర్స్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆలోచనను కూడా రేకెత్తిస్తారు. తెలుగులో ఇలాంటి దర్శకులు తక్కువ. ఆ తక్కువలోనూ ఎక్కువ ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మరోసారి తనకే సొంతమైన ఓ బలమైన సామాజిక సమస్యకు ఓ గొప్ప ప్రేమకథను జోడించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ తర్వాత ఆర్టిస్టులకే ప్రధాన బలంగా వచ్చిన ఈ మూవీ రివ్యూ చూద్దాం..

రేవంత్(నాగచైతన్య) హైదరాబాద్ లో జుంబా డ్యాన్స్ నేర్పే కుర్రాడు. ఆ పక్కింట్లోకి సాఫ్ట్ వేర్ జాబ్ వెదుక్కుంటూ వస్తుంది మౌనిక(సాయిపల్లవి). మౌనిక ఫ్రెండ్ రేవంత్ స్టూడెంట్. అలా ఇద్దరి మధ్య పరిచయం కలుగుతుంది. ఇద్దరిదీ ఒకే ఊరని తెలుస్తుంది. ఇటు మౌనికకు జాబ్ రాదు. జాబ్ లేకపోతే తన బాబాయ్ తో సమస్య. అందుకే అక్కడే ఉండి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఓ రోజు అనుకోకుండా రేవంత్ డ్యాన్స్ స్కూల్ లో అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది.

అది చూసి తనతో జాయిన్ కావాలని ఒప్పిస్తాడు రేవంత్. ఇద్దరూ కలిసి స్టూడెంట్స్ ను పెంచుతారు. ఓ పెద్ద డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తారు. ఇద్దరి సామాజిక నేపథ్యాలు వేరు అని తెలిసి కూడా ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఆ ప్రేమకు మౌనిక వాళ్ల బాబాయ్ అడ్డుపడతాడు. అసలు అతనెవరు..? ఎందుకు అడ్డు చెబుతున్నాడు. వీరి సామాజిక నేపథ్యాలేంటీ..? మరి ఈ లవ్ స్టోరీ ఫైనల్ గా ఏ తీరం చేరింది అనేది మిగతా సినిమా.

ప్రతి కథకూ ఓ నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఉండే తారతమ్యాలే కథనంగా మారతాయి. అయితే మన సొసైటీలో కుల, లింగపరమైన వివక్ష ఎక్కువగా ఉంది. అందుకే 20వ శతాబ్దంలో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయి. లవ్ స్టోరీలోనూ ఈ రెండు అంశాలను తీసుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. దీనికి ఓ అద్భుతమైన ప్రేమకథను జోడించాడు. ఇది మనం రెగ్యులర్ గా చూస్తోన్న తెలుగు సినిమా ప్రేమకథలా ఉండదు.

సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఇద్దరు మెచ్యూర్డ్ జంట మధ్య ప్రేమ పుడితే.. ఎలా ఉంటుందో అంత బాధ్యతగా రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే ఆ ఇద్దరి మధ్య కులపరమైన భేదం ఉంటుంది. ప్రేమకు అవి అక్కర్లేదు. కానీ కులాన్ని తమ హోదాగా భావించే కొందరికి కావాలి కదా. అక్కడే సమస్య మొదలవుతుంది. ఇది రెగ్యులర్ గా ఉంటుంది కదా అనుకున్న టైమ్ లో ఆడవారికి సంబంధించిన ఇష్యూను తీసుకుని కొత్త టర్న్ ఇస్తాడు శేఖర్ కమ్ముల. ఇది చాలా ఇళ్లల్లో జరిగేదే అని పోలీస్ లు, సామాజిక ఉద్యమకారులను ఎవరిని అడిగినా చెబుతారు. అదేంటో సినిమా చూసి తెలుసుకుంటేనే మంచిది.

ఇలాంటి కథ ఇప్పటి వరకూ రాలేదా అంటే వచ్చింది. కానీ అది కమర్షియల్ కోణంలో ఉంటే.. ఇది ఆలోచనాత్మకంగా కనిపిస్తుంది. చెబితే పరువు పోతుందనో.. లేకపోతే భయం వల్లో ఎన్నో విషయాల్లో అడవాళ్లు గడపదాటరు. అయితే ప్రతి మహిళా ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక కులం విషయంలో కూడా ఎవరినో తిడుతూనో, లేదంటే మరేదో చెబుతూనో ఆగలేదు శేఖర్ కమ్ముల. తక్కువ కులంలో ఉన్నా.. మన చేయిపైన ఉండాలని.. ఎవరినీ యాచించకూడదు అంటూ ఓ గొప్ప సందేశం కూడా అంతర్లీనంగా చెబుతాడు.

ఆరంభం నుంచి ఆ రెండు అంశాలూ కనిపిస్తున్నా.. ఎక్కడా హార్డ్ గా ఉండదు. అందమైన ప్రేమకథ, అద్భుతమైన పాటలతో ఆసాంతం హాయిగా వెళుతుంది కథనం. ఇది శేఖర్ మార్క్ కథనం అందుకే కాస్త స్లోగా ఉన్నా.. ఎక్కడా బోరింగ్ అనిపించదు. అందుకే శేఖర్ కమ్ముల నుంచి మరో గొప్ప లవ్ స్టోరీ వచ్చిందనే చెప్పొచ్చు.

ఇక సినిమాలో రేవంత్ గా నటించిన నాగచైతన్యకు ఇది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. అతనిలో ఇంత మంచి పర్ఫార్మర్ ఉన్నాడన్న విషయం తొలిసారి తెలిసిందంటే ఆశ్చర్యమే. ఫిదా సాయి పల్లవికి లవ్ స్టోరీ సాయిపల్లవికి అస్సలు పోలికే ఉండదు. అంత గొప్ప పాత్ర. తనూ అంత గొప్పగా నటించింది.

తర్వాత రాజీవ్ కనకాలకు ఎక్కువ మార్కులు పడతాయి. అతన్ని చూస్తేనే ఓ రకమైన భయం కనిపిస్తుంది. అది అతని నటన స్థాయి. ఇతర పాత్రల్లో ఈశ్వరీరావు సహజ నటనతో అలరిస్తే.. దేవయాని, ఉత్తేజ్ ఆకట్టుకుంటారు. ఇక టెక్నికల్ గా శేఖర్ కమ్ముల సినిమాలు ఎప్పుడూ బావుంటాయి. ఆల్రెడీ పాటలు బ్లాక్ బస్టర్. నేపథ్య సంగీతం చాలా బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ బావున్నాయి. ఏసియన్ సినిమా వారి ఫస్ట్ మూవీతో ఓ గొప్ప కథను అందించారు. ఇక శేఖర్ కమ్ముల రైటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇలాంటి కథలు చెప్పాలంటే దర్శకుడిలో సిన్సియారిటీ ఉండాలి. అది శేఖర్ కు ఉందని కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమా తెలుగులో వచ్చిన గొప్ప లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచిపోతుందనే టాక్ తెచ్చుకుంది.


- బాబురావు కామళ్ల.

Tags

Read MoreRead Less
Next Story