Manchu Vishnu Maa Elections 2021: ప్రకాష్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు

Manchu Vishnu Maa Elections 2021: ప్రకాష్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు
Manchu Vishnu Maa Elections 2021: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఆయన తమ కుటుంబంలో ఒక భాగమన్నారు.

Manchu Vishnu in MAA Elections: నటుడు ప్రకాష్‌రాజ్ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు రాజీనామా చేయడంపై మంచు విష్ణు స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఆయన తమ కుటుంబంలో ఒక భాగమన్నారు. ప్రకాష్‌రాజ్‌తో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకాష్‌రాజ్‌ ఆలోచనలు తనకు అవసరమని, త్వరలోనే ఆయన్ను కలిసి... అన్ని విషయాలపై చర్చిస్తానన్నారు మంచు విష్ణు.

అంతకుముందు ప్రకాశ్‌ రాజ్‌ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఎందుకు రాజీనామా చేస్తున్నానో చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఇతర భాష నటులు అధ్యక్షుడిగా పోటీ చేయొద్దన్నపుడు వేరే భాష నటులు సభ్యులుగా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో లోకల్ - నాన్‌ లోకల్‌ ఫీలింగ్‌ తెచ్చారని విమర్శించారు ప్రకాశ్ రాజ్.

మా అసోసియేషన్‌లో తెలుగు వాళ్లే పోటీ చేసేలా బైలాస్‌ తీసుకొస్తామంటూ మంచు ప్యానెల్ సైతం ప్రకటించింది. కోట శ్రీనివాస్, రవిబాబు వంటి సీనియర్లు సైతం.. అతిథులు అతిథులుగానే ఉండాలని గట్టిగానే చెప్పారు. దీంతో మా అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న మరికొందరు రాజీనామా బాట పట్టొచ్చనే టాక్ నడుస్తోంది.

అటు నాగబాబు సైతం పదేపదే నాన్‌ లోకల్‌ అంశాన్ని తెరపైకి తీసుకురావడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

నాగబాబు సైతం.. ఇప్పటికే మాకు రాజీనామా చేశారు. సినిమా ఆర్టిస్టులంతా ఒక్కటే అయినప్పుడు.. ఈ ఎన్నికల్లో నాన్‌లోకల్ ప్రస్తావన తీసుకురావడం అసంబద్ధం అన్నారు. నరేష్ లాంటి వాళ్లంతా తాము నాన్‌లోకల్ అంశాన్ని తీసుకురావడం లేదని మొదట్లో చెప్పుకొచ్చారు. ప్రకాశ్‌ రాజ్‌ ఇక్కడి వ్యక్తి కాకపోవడం వల్లే తనను వ్యతిరేకించడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.

కాని, రానురాను మా ఎన్నికల ప్రచారం మొత్తం లోకల్, నాన్‌లోకల్ చుట్టే తిరిగింది. మరోవైపు నాగబాబు మద్దతిచ్చినా ప్రకాశ్‌ రాజ్‌ ఓడిపోవడంతో.. ఈ ఓటమి మెగా కాంపౌండ్‌కి ఎదురుదెబ్బ అని వాదిస్తున్న వాళ్లూ ఉన్నారు. మాలో చీలికకు భవిష్యత్తులో ఇది కూడా కారణం కావొచ్చన్న వాదన వినిపిస్తోంది.

మా ఎన్నికలు అసోసియేషన్‌ చీలికకు దారితీస్తుందా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమా కళాకారులంతా ఒక్కటే అన్నప్పుడు ఇందులో ప్రాంతీయవాదం ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు.

అందరికీ సభ్యత్వం ఉన్నప్పుడు, పోటీ విషయంలోనూ అందరికీ సమాన హక్కులు కావాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం స్తబ్దుగానే ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ఇదే అంశంపై తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ రెండుగా చీలిపోవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story