'మా'కు మేమే: మెగాస్టార్ చిరంజీవి

మాకు మేమే: మెగాస్టార్ చిరంజీవి
ఒకప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే ఓ గౌరవం, ప్రతిష్ట ఉన్నాయి. ఆ సంస్థకు అధ్యక్ష, కార్యదర్శకులుగా చేసిన.

తెలుగు సినిమా పరిశ్రమకు కష్టకాలం నడుస్తోంది. వరుస లాక్ డౌన్స్ కారణంగా ఎగ్జిబిషన్ వ్యవస్థ కుదేలైపోయింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లను దారుణంగా తగ్గించింది. దీంతో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిసేందుకు పరిశ్రమలోని పెద్దలు నిర్ణయించారు. కానీ ఈ సమావేశానికి కీలకమైన వ్యక్తులను కాదని.. అస్సలే మాత్రం ప్రాధాన్యత లేనివారిని పిలిచారు అనే విమర్శలు వస్తున్నాయి.

ఇది చిరంజీవి కేంద్రంగా జగన్ మెప్పుకోసం జరిగిన మీటింగ్ లా కనిపిస్తోందంటున్నారు. అలా చూసినా మోహన్ బాబును ఆహ్వానించలేదు. క్రిష్ణగారి ఫ్యామిలీనీ పట్టించుకోలేదు. మా నుంచి మొదలై.. జగన్ చుట్టూ తిరుగుతోన్న ఈ రాజకీయం ఇండస్ట్రీని రెండు ముక్కలు చేయబోతోందా..?ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ఈ తరుణంలో గ్రూపులు పక్కన బెట్టి కలిసి కట్టుగా ఉండాల్సింది పోయి.. మాకు మేమే మీకు మీరే అని ఏకంగా మెగాస్టార్ కేంద్రంగా ఓ చీలిక మొదలైంది. మరి ఈ పరిణామం పరిశ్రమను ఎటు తీసుకువెళుతుంది..? గ్రూపుల కుంపట్లతో రాబోయే రోజుల్లో పరిశ్రమ ఇంక ఏకతాటిపైకి రావడం అసాధ్యమేనా..? అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది..?

ఒకప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే ఓ గౌరవం, ప్రతిష్ట ఉన్నాయి. ఆ సంస్థకు అధ్యక్ష, కార్యదర్శకులుగా చేసిన వాళ్లు కూడా హుందాగా వ్యవహరించారు. పరిశ్రమ సమస్యలను పరిష్కరించడంలో ఒక్కతాటిపై నిలిచారు. అందరినీ కలుపుకునిపోయారు. కలిసికట్టుగా ఉన్నారు. దీంతో 'మా'అనే షార్ట్ నేమ్ ఈ సంస్థకు చక్కగా కుదిరింది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా..? రోజులు మారాయి. మనుషులూ మారుతున్నారు. ఆ మార్పు నుంచే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో లుకలుకలు మొదలయ్యయి. ఆధిపత్యం కోసం ఆరాటం మొదలైంది. దీంతో అనివార్యంగా ఎన్నికలు వచ్చాయి.

2019కి ముందు వరకూ కూడా మా ఎన్నికలు సజావుగానే సాగాయి. 2019 మా ఎలెక్షన్స్ మాత్రం సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి బస్తీ 'మా'సవాల్ అంటూ తలపడ్డారు. నరేష్ ప్యానల్ విజయం సాధించింది. బట్.. ఆ టీమ్ ఆ సాయంత్రం నుంచే ఘర్షణలు మొదలుపెట్టింది. సొంత ప్యానల్ నుంచే విమర్శలు మొదలయ్యాయి. మరి అవతలి ప్యానల్ ఊరుకుంటుందా.. విమర్శలు ప్రతివిమర్శలు. కట్ చేస్తే సీన్ క్రమశిక్షణా సంఘానికి చేరింది.

క్రమశిక్షణ సంఘంలోనూ గొడవ జరిగింది. కొందరు పెద్దలు బాధపడ్డారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వాళ్లు మారలేదు. దీంతో ఈ సారి చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే ప్రకాష్ రాజ్ ను మా అధ్యక్షుడుగా ప్రతిపాదిస్తూ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టించాడు. తెర ముందు చిరంజీవి ఎప్పుడూ కనిపించలేదు. కానీ అన్ని పావులూ ఆయనే కదిపారు అనేది అందరికీ తెలిసిన సత్యం. అసలే నిత్య గొడవలతో రగులుతోన్న ఇండస్ట్రీకి ప్రకాష్ రాజ్ అధ్యక్షుడు అనగానే మరింత కోపం వచ్చింది. గ్రూపులు, విమర్శలు పెరిగాయి.

ప్రకాష్ రాజ్ కు కౌంటర్ గా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తానూ అధ్యక్ష పదవికి బరిలో ఉన్నానంటూ వచ్చాడు. ఆయనతో పాటు మేముసైతం అంటూ జీవిత, హేమ వంటి వారూ ముందుకు వచ్చారు. దీంతో తను చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రకాష్ రాజ్ ను ఏకగ్రీవం చేస్తారు అనుకున్న చిరంజీవికి భంగపాటు తప్పలేదు. పైగా కొన్నాళ్లుగా బాలకృష్ణను చిరంజీవి అండ్ కో పట్టించుకోవడం లేదు. అనివార్యంగా బాలయ్య విష్ణుకు సపోర్ట్ చేశాడు. మొత్తంగా వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ పోటీలో ఎవరు గెలిస్తే వారిదే అధ్యక్షపదవి. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్య వచ్చింది.

వరుస లాక్ డౌన్స్ తో పరిశ్రమ సగం కుదేలయింది. ప్రభుత్వాల నుంచి రాయితీలు ఆశిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంత మేరకు పరిశ్రమకు మేలు జరిగే అంశాలకు పర్మిషన్ వచ్చింది. కానీ యావరేజ్ సినిమాకూ డిజాస్టర్ రివ్యూస్ వచ్చినట్టుగా.. అసలే లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతోన్న ఎగ్జిబిషన్ రంగానికి షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టికెట్ రేట్లను దారుణంగా తగ్గించింది. దీంతో ఎగ్జిబిషన్ రంగం పూర్తిగా డీలా పడిపోయింది. మరోవైపు యాభైశాతం ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఇచ్చింది. ఇటు చూస్తే ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఎన్నాళ్లుగానో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు చెప్పాలని ప్రయత్నిస్తోంది పరిశ్రమ. చాలా ఆలస్యంగా ఇన్నాళ్లకు అక్కడ అపాయింట్ మెంట్ దొరికింది.

అపాయింట్ మెంట్ ఇవ్వగానే గతంలో కొందరు మాత్రమే వెళ్లి విమర్శల పాలయ్యారు. దీంతో ఈసారి అందరి సలహాలూ, సూచనలు తీసుకుని.. సమగ్రమైన నివేదికతో వెళ్లాలనుకున్నారు. ఇది మంచి ఆలోచనే. పరిశ్రమను నమ్ముకుని వేలాదిమంది ఉన్నారు. అందరికీ మేలు చేయాలంటే కొందరు ముందుకు రావాలి. కానీ దాని అమలే ఇప్పుడు పరిశ్రమను ముక్కలు చేయడానికి కారణమైంది. చిరంజీవి ఇంట్లో నిన్న పరిశ్రమలోని కొందరు పెద్దలు సమావేశమయ్యారు. కానీ ఈ సమావేశానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేని, ప్రభావం చూపని వ్యక్తులను పిలవడంతో మరోసారి చిరంజీవి తెరవెనక రాజకీయాలు బహిర్గతం అయ్యాయి.

మా ఎన్నికలకు సంబంధించి తను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది.. తను చెప్పినవారినే ఈ సారి అధ్యక్షుడిని చేస్తారు అనుకున్నారు చిరంజీవి. కానీ అలా జరగలేదు. ఇది ఆయనకు కోపం తెప్పించింది. అందుకు కారణమైన వ్యక్తులను దూరం పెట్టడం మొదలుపెట్టాడు అనేందుకు ఇది మొదటి మెట్టుగా చూడాలి. లేదంటే పరిశ్రమ మనుగడకే ఉపయోపడాల్సిన విషయంలోనూ తనదైన స్వార్థపూరితమైన ఆలోచనతో ముందుకు వెళ్లాలనుకోవడం ఖచ్చితంగా గర్హించాల్సిన విషయమే అనేది పరిశ్రమలోని ఇతరుల వాదన.

వీళ్లంతా జగన్ ప్రాపకం కోసం చూస్తున్నారు అనేది అందరి వాదన. అలా అనుకున్నా.. జగన్ కు మిత్రుడుగా ఉన్న మోహన్ బాబును పిలవాలిగా..? అలాగే జగన్ తో సన్నిహితంగా కనిపించే కృష్ణగారి ఫ్యామిలీ నుంచీ ప్రాతినిధ్యం ఉండాలి కదా. వారి ఊసే లేదు. అలాగే ఏ అంశంలోనైనా కూలంకషంగా పరిశీలించి సలహాలు ఇవ్వగలిగిన మేధావిగా పేరున్న త్రివిక్రమ్ నూ పిలవలేదు. వైఎస్ఆర్ పార్టీ నుంచి నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిచింది పూరీ జగన్నాథ్ సోదరుడు. అలాంటి పూరీనీ పిలవలేదు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ గా ఉన్న సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి వంటి వారి ఊసే లేదు. ఇక జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కన్నబాబు సోదరుడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వంటి వారినైనా పిలవాల్సింది కదా..?

ఎవరెంత స్టార్లు అనుకున్నా.. ఎంత తోపులు అని ఫీలైనా.. పరిశ్రమను పోషించేది నిర్మాతలు, ఎగ్జిబిటర్లే. ఈ రెండు అంశాలకు సంబంధించిన కీలకమైన అభిప్రాయాలతో ముఖ్యమంత్రికి నివేదించాలనుకున్నప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్ లు గా ఉన్న హారిక హాసిని, మైత్రీ మూవీస్ వంటి వారినీ పట్టించుకోలేదు. పోనీ వెళ్లినవాళ్లంతా నిజంగా అర్హులేనా అంటే అక్కడ ఉన్న వారిని చూస్తేనే తెలుస్తుంది. చిరంజీవి ఎంత స్వార్థపూరితంగా తన నాయకత్వాన్ని ఇండస్ట్రీపై రుద్దాలని చూస్తున్నాడో. కేవలం తన అనుకున్నవాళ్లు, తను చెప్పిన ప్రతిదానికీ తల ఆడించేవారిని మాత్రమే ఆహ్వానించాడు.

మొత్తంగా ఇప్పుడు చిరంజీవి కేంద్రంగా ఇండస్ట్రీలో జరుగుతోన్న పరిణామాలు చూస్తోంటే చిరంజీవి.. జగన్ ప్రభుత్వం ప్రాపకం కోసం చూస్తున్నాడేమో అని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అదే నిజమైతే ఆయనకు మాత్రమే ఉపయోగం కానీ పరిశ్రమకు ఒరిగేదేంటీ..? అసలు ఆ మీటింగ్ చేసిన తీర్మానాలేంటీ..? ఏ సమస్యలతో ప్రభుత్వం వద్దకు వెళుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లబోతోన్న కీలక సభ్యులెవరు అనేది ఇంకా మిగిలే ఉన్న ఆట. మరి ఈ ఆటను చిరంజీవి ఎలా ప్లాన్ చేశాడో కానీ.. మెగాస్టార్ గా ఓ స్థాయిలో ఉన్న చిరంజీవి స్వయంగా ఇండస్ట్రీలో చీలికలకు కారణం అవుతున్నాడనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

- కామళ్ల బాబూరావు

Tags

Read MoreRead Less
Next Story