సినిమా

Bangarraju Review: వాసివాడి తస్సాదియ్యా.. అక్కినేని హీరోలు అదరగొట్టారు..!

Bangarraju Movie Review: మొత్తంగా సంక్రాంతి సందర్భంగా వచ్చిన బంగార్రాజు ప్రతి ఫ్రేమ్ లోనూ పండగ లాంటి కలర్ ఫుల్ సీన్స్ తో ఆకట్టుకుంటాడు.

Bangarraju Review: వాసివాడి తస్సాదియ్యా..  అక్కినేని హీరోలు అదరగొట్టారు..!
X

ఫ్రైడే వచ్చిందంటే కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ప్రతివారం వచ్చే సినిమాలతో థియేటర్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. అలాంటిది పండగ రోజే ఫ్రైడే వస్తే ఇంకెత సందడి ఉంటుంది. యస్.. ఇవాళ బంగార్రాజు, రౌడీబాయ్స్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ముందు నుంచీ బంగార్రాజుపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం నాగార్జున, నాగచౌతన్య కలిసి నటించడం ఓ కారణమైతే.. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సోగ్గాడే చిన్నినాయనాకు ఇది సీక్వెల్ కావడం. మరి ఈ మూవీ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ మినీ రివ్యూలో చూద్దాం.

బంగార్రాజు.. సీక్వెల్ మొదలైన దగ్గర నుంచీ అందరిలోనూ ఆసక్తి ఉంది. సోగ్గాడే చిన్నినాయనా నాగ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం. అదో రీజన్ అయితే.. నాగచైతన్య పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందా అనేది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా నిలిచింది. దీనికి తోడు సినిమాను చాలా వేగంగా పూర్తి చేశారు. సంక్రాంతి బరిలో సర్కారువారిపాట, రాధేశ్యామ్, భీమ్లానాయక్ ఉన్నప్పుడే వీళ్లూ మేమూ వస్తున్నాం అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ కు కారణం కథపై నమ్మకమే కదా..? మరి ఆ కథ ఎలా ఉంది.. కథనం ఎలా నడించిందీ అనేది చూద్దాం..

శివపురం ఊరి శివాలయంలో చోరీతో మొదలవుతుంది బంగార్రాజు సినిమా. ఆ గుడికి కాపలాగా ఉన్న నాగుపాము కాటుతో దొంగలు చనిపోతారు. అప్పటికే శివలింగం కదిలించడంతో దాన్ని అభిషేకించేందుకు నది ఉగ్రరూపం దాల్చుతుంది. ఆ ప్రవాహానికి గుడి శుభ్రం అవుతుంది. కానీ అక్కడి నిధిలోని కొన్ని వజ్రాలు బయటపడతాయి. అవి ఇతరులకు దొరికితే ఎలాంటి ప్రళయం వస్తుందో శివుడికి తెలుసు.

దాన్ని తప్పించే బాధ్యత ఎవరికి ఇవ్వాలా అని అనుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో రాముకి కొడుకు పుడతాడు. అలాగే సత్యభామ తమ్ముడికీ కూతురు పుడుతుంది. ఈ ఇద్దరికీ పెళ్లి చేయాలని చిన్నప్పుడే నిర్ణయం చేస్తారు. అయితే రాము కొడుకు ద్వారా..? ఈ గుడిని మరోసారి రక్షించాలని యముడు, దేవలోకంలో ఉన్న ఇంద్రుడు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని అమలు పరిచేందుకు మళ్లీ చనిపోయిన బంగార్రాజునే ఎంచుకుంటారు..? మరి రాము కొడుకు ఎలా ఉంటాడు..? చనిపోయిన బంగార్రాజు మనవడితో పాటు గుడిని ఎలా కాపాడుకున్నాడు..? అనేది మిగతా కథ.

సోగ్గాడే చిన్నినాయనా ఎక్కడ ఎండ్ అయిందో సరిగ్గా అక్కడే ప్రారంభం అవుతుంది బంగార్రాజు మూవీ. ఈ విషయంలో దర్శకుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. అటు సీనియర్ బంగార్రాజు ఈ సారి స్వర్గానికి వెళ్లి అక్కడి దేవ కన్యలతో ఎప్పట్లానే తనదైన శైలిలో ఆడిపాడుతుంటాడు. రాము తనయుడుగా పరిచయం అయిన నాగచైతన్య ఎంట్రీ తర్వాత కథనంలో ఊపొస్తుంది. అతని చిన్నతనంలోనే నానమ్మ సత్యభామ కూడా చనిపోతుంది.

ఆమె కూడా స్వర్గానికి వెళ్లి బంగార్రాజును కలుస్తుంది. మొదటి భాగం అంతా.. చిన్న బంగార్రాజు ప్లే బాయ్ క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ సాగుతుంది. తర్వాత అతని పెళ్లి కోసం దివి నుంచి భువికి దిగి వస్తాడు బంగార్రాజు. ఈ క్రమంలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఎక్కువ పాటలు కూడా కథనానికి అడ్డుగా నిలిచాయి. అయినా నాగ్, చైతన్యల సీన్స్ అన్నీ ఎంటర్టైన్ చేస్తాయి.

సెకండ్ ఆరంభం నుంచే మంచి టేకాఫ్ లా కనిపిస్తుంది. మొదలైన దగ్గర్నుంచి ఎక్కడా కథనం తగ్గదు. ప్రతి సీన్ నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతూ ఫస్ట్ హాఫ్ అంచనాలకు భిన్నంగా సాగుతుంది. ముఖ్యంగా చైతూ, కృతిశెట్టి మధ్య వచ్చే సీన్స్ సెకండ్ హాఫ్ లో అద్భుతంగా సెట్ అయ్యాయి. బావామరదళ్ల సందడికి కాస్త ఫాదర్ సెంటిమెంట్ జోడించిన బర్త్ డే సీన్, మామిడితోటలో ఎద్దుతో ఉండే సీన్ అన్నీ మాస్ తో పాటు క్లాస్ ఆడియన్సెస్ ను సైతం మెస్మరైజ్ చేస్తాయి. ఇక విలన్ కు సంబంధించి ఒకరిని మించి ఒకరిని పరిచయం చేస్తూ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.

పుడుతూనే తల్లిని కోల్పోయి.. తర్వాత తండ్రి దూరమై.. పెరుగుతున్నప్పుడు నాన్నమ్మా దూరమైతే ఆ బాధను తగ్గించుకునేందుకు నవ్వుతున్నట్లు నటిస్తున్నానని చైతన్య చెప్పే సీన్ లో అతని నటన సింప్లీ సూపర్బ్. క్లైమాక్స్ లో వరుసగా వచ్చే రెండు మూడు ట్విస్టులు మాస్ ను ఊపేస్తాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి విజిల్ బ్లోయింగ్ సీన్స్ సెకండ్ హాఫ్ లో చాలానే ఉన్నాయి. ఇదే బంగార్రాజుకు అతి పెద్ద బలం. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా వచ్చిన బంగార్రాజు ప్రతి ఫ్రేమ్ లోనూ పండగ లాంటి కలర్ ఫుల్ సీన్స్ తో ఆకట్టుకుంటాడు.

నాగచైతన్య తండ్రితో పోటీ పడి మరీ నటించాడు. నాగ్ కూడా తనదైన పంచెకట్టు ఆహార్యంలో ఆ పాత్రను తన కెరీర్ లో ఓ బెస్ట్ రోల్ గా మలిచాడు. అవసరాన్ని బట్టి మనవడిలోకి వెళ్లిపోయే పాత్రతో పాటు రమ్యకృష్ణతో రొమాంటిక్ సీన్స్ కూడా అలరిస్తాయి. కృతిశెట్టి నటన ఇంకా మెరుగవ్వాలి. తను పాత్రకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కూడా ఒకటుంటుందని గమనించాల్సి ఉంది. ఇతర పాత్రల్లో రావు రమేష్ ఎప్పట్లానే ఆకట్టుకుంటే.. ఫస్ట్ పార్ట్ లో ఉన్న సంపత్ క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేస్తుంది. ప్రత్యేక పాటల్లో కనిపించిన హీరోయిన్లంతా గ్లామర్ ఫుల్ గా అలరించారు.

టెక్నికల్ గా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ఎసెట్ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కలర్ ఫుల్ గా ఉంటుంది. అటుపై విజువల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకోవాలి. ఓ భారీ బడ్జెట్ చిత్రానికి ఏ మాత్రం తీసిపోని గ్రాఫిక్స్ కనిపిస్తాయి. మ్యూజిక్ పెద్ద హెల్ప్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఎడిటర్ కు ఇంకాస్త పని చెప్పాల్సి ఉంది. ఆర్ట్ వర్క్ తో పాటు కాస్ట్యూమ్స్ కూడా బావున్నాయి. అన్నపూర్ణ బ్యానర్ లోనే రూపొందిన ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బంగార్రాజు సంక్రాంతికి ఆకట్టుకుంటాడు. ఓవరాల్ గా బంగార్రాజు సంక్రాంతి లాంటి సందర్భాల్లోనే రావాల్సిన సినిమా అని చెప్పొచ్చు. మరి కమర్షియల్ గా ఈ మూవీ ఏ రేంజ్ కు వెళుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.

Next Story

RELATED STORIES