సినిమా

Sobhan Babu birthday Special: తెలుగువారి సోగ్గాడు.. నట భూషణుడు శోభన్ బాబు

Sobhan Babu birthday Special: అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్...ఇలాంటి విశేషణాలు శోభన్ బాబుకు తప్ప మరే నటుడి గురించి వినబడలేదు.

Sobhan Babu birthday Special: తెలుగువారి సోగ్గాడు.. నట భూషణుడు శోభన్ బాబు
X

Sobhan Babu birthday special: తెలుగువారి అందాలనటుడు...అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్...ఇలాంటి విశేషణాలు శోభన్ బాబుకు తప్ప మరే నటుడి గురించి వినబడలేదు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా...డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారాయన. ఎక్కడ మొదలు పెట్టాలో...ఎక్కడ ఆపేయాలో తెల్సి ఆచరించడం చాలా గొప్ప వాళ్లకు మాత్రమే సాధ్యం. అది శోభన్ కు సాధ్యమైంది. వెండితెర అభిమన్యుడు శోభన్ బాబు జయంతి సందర్భంగా ఒక్కసారి అందమైన జ్నాపకాల్లోకి వెళ్దాం.

శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది దైవబలం అనే జానపద చిత్రంతో. ఎన్.టి.ఆర్ హీరోగా చేసిన దైవబలంలో శోభన్ బాబు ఓ చిన్న పాత్ర ధరించారు. శోభన్ స్క్రీన్ మీదకు వచ్చిన టైమ్ లో జానపదాలు, పౌరాణికాల రాజ్యం నడుస్తోంది. ఆ తర్వాత అన్నగారి పౌరాణిక చిత్ర రాజం లవకుశలో రామానుజుడుగా నటించి మెప్పించారు. నర్తనశాలలో అభిమన్యుడుగా, కృష్ణపాండవీయంలో అర్జునుడుగా నటించిన శోభన్ జానపద, పౌరాణిక పాత్రల్లో బావుంటాడనే టాక్ వచ్చేసింది.

శోభన్ ను టైటిల్ రోల్ లో పెట్టి వీరాభిమన్యు తీశారు మధుసూదనరావు. సరిగ్గా అదే టైమ్ లో తెలుగు తెర మీద పౌరాణికాలు తగ్గుముఖం పట్టాయి. సోషల్ మూవీస్ అప్పర్ హ్యాండ్ అయ్యాయి. మరో వైపు జానపదాల ప్లేస్ లో క్రైమ్ సినిమాలు దూసుకు వచ్చేశాయి. దీంతో శోభన్ కెరీర్ మళ్లీ మొదటికొచ్చినట్టైంది. ఆదుర్తి సుబ్బారావు సుమంగళితో సోషల్ మూవీస్ లోకి మారారు శోభన్. విశ్వనాథ్ డైరక్ట్ చేసిన ప్రైవేటు మాస్టర్, బిఎన్ రెడ్డి బంగారు పంజరం, కె.బాలచందర్ సత్తెకాలపు సత్తయ్య, తాతినేని రామారావుతో మంచి మిత్రులు సినిమాలు చేసి ఆడియన్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

శోభన్ బాబు డైరక్టర్స్ హీరో. ఆయన కెరీర్ లో ప్రధానంగా నలుగురైదుగురు డైరక్టర్లు కనిపిస్తారు. కె.ఎస్ ప్రకాశరావు, కె.విశ్వనాథ్, బాపు, వి.మధుసూధనరావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు. వీళ్లందరూ శోభన్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ అని చెప్పుకునే సినిమాలు తీశారు. తనలోని నటుడ్ని పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

నర్తనశాలలో అభిమన్య కుమారుడుగా అదరగొట్టిన శోభన్ బాబుతో సుందర్ లాల్ నహతా వీరాభిమన్యు ప్రారంభించారు. ఆ సినిమా దర్శకుడు వి. మధుసూధనరావు. సాధారణంగా సోషల్ మూవీస్ అంటేనే ఇష్టపడే విఎమ్మార్ వీరాభిమన్యు తర్వాత చేసిన చాలా సినిమాల్లో శోభన్ బాబే హీరో. సెన్సేషనల్ మూవీ మనుషులు మారాలిలో శోభన్ తో కార్మిక నాయకుడి పాత్ర చేయించారు మధుసూదనరావు.

ఆ తర్వాత ఈ బంధం చాలా కాలం కంటిన్యూ అయింది. లక్ష్మీనివాసం, కళ్యాణమండపం, చక్రవాకం, జేబుదొంగ, ఇద్దరూ ఇద్దరే, ఈ తరం మనిషి, మల్లెపూవు ఇలా సాగింది వీరిద్దరి అనుబంధం. అన్నీ హిట్సే. శోభన్ బాబు ఏ తరహా కారక్టర్ కైనా న్యాయం చేయగలడని ప్రూవ్ చేసిన డైరక్టర్ మధుసూదనరావు.

విశ్వనాథ్ కెరీర్ లో శోభన్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు. ప్రైవేటు మాస్టారు చిత్రంతో ప్రారంభమైన వీరిద్దరి ప్రయాణం నిండు హృదయాలు, చిన్న నాటి స్నేహితులు, శారద, జీవనజ్యోతి, జీవిత నౌక, కాలాంతకులు, చెల్లెలి కాపురం ఇలా కొనసాగింది. శోభన్ బాబు గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు...డీ గ్లామర్ రోల్స్ నూ అద్భుతంగా చేసి మెప్పించగలడని నిరూపించిన చెల్లెలి కాపురం విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నదే.

శోభన్ బాబుతో పూర్తి విభిన్నపాత్రలు చేయించిన దర్శకుడు బాపు. బుద్దిమంతుడులో కృష్ణుడుగా శోభన్ ను చూపించి ఆడియన్స్ తో శభాష్ అనిపించారు. రాముడుగా రామారావును తప్ప ఇంకొకరిని ఆడియన్స్ ఒప్పుకోరనుకుంటున్న సమయంలో సంపూర్ణ రామాయణం తీశారు. సాక్షాత్తు ఎన్.టి.ఆర్ రాముడుగా శోభన్ బాబు చక్కగా ఉన్నాడని కితాబు ఇవ్వడం విశేషం.

శోభన్ బాబు తో ప్రత్యేక అనుబంధం ఉన్న మరో దర్శకుడు దాసరి నారాయణరావు. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం బలిపీఠం. చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి, అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబును తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మలి చిత్రం గోరింటాకు. తర్వాత స్వయంవరం వంటి మెమరబుల్ మూవీస్ మరెన్నో వచ్చాయ్..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఆయన తండ్రి కె.ఎస్. ప్రకాశరావు ఇద్దరూ శోభన్ కాంబినేషన్ లో సూపర్ హిట్స్ తీశారు. ఇదాలోకం, కోడెనాగు, తాసీల్దారుగారి అమ్మాయి లాంటి సక్సస్ ఫుల్ మూవీస్ కె.ఎస్ ప్రకాశరావు తీశారు. ఇక రాఘవేంద్రరావైతే తన మొదటి సినిమానే శోభన్ తో చేశారు. బాబుతో గ్లామర్ హీరో శోభన్ ను మరింత గ్లామరస్ గా చూపించి సత్తా చాటారు. ఆ తర్వాత రాజా, మోసగాడు, దేవత, ఇద్దరు దొంగలు, అశ్వమేథం సినిమాలు తీశారు. దేవతతో అద్భుతమైన విజయం సాధించారు.

అక్కినేని పర్మినెంట్ బ్యానర్ జగపతి పిక్చర్స్ లో కూడా శోభన్ బాబు సూపర్ హిట్స్ కొట్టారు. శోభన్ తో తప్ప మరొకరితో చిత్రాలు నిర్మించని నిర్మాత చటర్జీ. సమత ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమాలన్నిట్లోనూ శోభన్ బాబే హీరో. జూదగాడు, జేబుదొంగ, జీవిత రథం లాంటి సినిమాలు చేసిన చటర్జీనే..శోభన్ తో మల్లెపూవు లాంటి క్లాసిక్ మూవీ కూడా తీయడం విశేషం. నిజానికి శోభన్ కెరీర్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో వచ్చి మంచి విజయాన్ని అందించింది మల్లెపూవు.

శోభన్ బాబుతో అన్ని రకాల పాత్రలూ చేసి మెప్పించిన హీరోయిన్ శారద. శోభన్, శారదలది హిట్ పెయిర్ అనేవారు. కాంచన, చంద్రకళ, లక్ష్మీ లాంటి ఆనాటి గ్లామర్ హీరోయిన్స్ కు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్నారు. ఇక ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ జయసుధ. సోగ్గాడుతో మొదలైన ఈ జోడీ.. కోడి రామకృష్ణ తీసిన ఆస్తి మూరెడు, ఆశబారెడు వరకూ కంటిన్యూ అయ్యింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మల్లెపూవు, మండే గుండెలు, ఇల్లాలు లాంటి సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి.

శోభన్ బాబు అంటే హీరోగా ఆడియన్స్ మనసుల్లో ముద్రపడింది. ఆ ముద్రను చెరిపేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ముసలి ముఖంతో వాళ్లకు కనిపించడానికి ఇష్టపడను అని చివరి రోజుల్లో తనను కలిసిన మిత్రులతో చెప్పేవారు శోభన్. శోభన్ బాబు అన్న మాట అక్షరాలా నిజం. ఆయన ఎంతగా ఆడియన్స్ హృదయాల్లో ముద్ర వేశారంటే.. విజయవాడ, రాజమండ్రి లాంటి సినిమా రాజధానుల్లో ఆయనకు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు అభిమానులు.

శోభన్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకం. ఎక్కడ మొదలు పెట్టాలో.. ఎక్కడ ముగింపు పలకాలో చాలా కొద్ది మందికే స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత ఉన్న అతి కొద్ది మందిలో శోభన్ ఒకరు. ఆయన వీరాభిమన్యుడు.. మూడు సార్లు అభిమన్యుడి పాత్ర చేసినా...నిజజీవితంలో మాత్రం ఆయన అర్జునుడే. ఆయనకు లోపలకు ప్రవేశించడమే కాదు...ఎక్కడ ఎలా నిష్క్రమించాలో కూడా తెల్సు. అందుకే ...శోభన్ ది గ్రేట్.

- బాబురావు కామళ్ల

Next Story

RELATED STORIES