Venkatesh: విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్..

Venkatesh: విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్..
Venkatesh:విక్టరీ వెంకటేష్ .. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది.

Venkatesh: విక్టరీని ఇంటి పేరుగా పెట్టుకుని విజయయాత్ర సాగించిన ఒన్ అండ్ ఓన్లీ స్టార్ వెంకటేష్. అప్పటి టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన కృషితోనే తెలుగు సినిమా పరిశ్రమలో ధృవతారగా వెలిగాడు. మరీ ఒంటరి పోరాటం చేయలేదు కానీ.. వచ్చిన ప్రతి అవకాశంలోనూ మెరిసే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.

బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డ్ కూడా అందుకుని ఆకట్టుకున్నాడీ చిత్రంతో. అయితే తొలి సినిమాలో అతని తెలుగు డిక్షన్ దారుణంగా ఉంది. కారణం.. అప్పటి వరకూ వెంకటేష్ ఫారిన్ లో చదువుకునేవాడు. ఈ సినిమా కోసం ఇండియాకు వచ్చాక.. ఆయన కోసం ఆరు నెలల పాటు తెలుగు ట్యూషన్ పెట్టించాడు రామానాయుడు. అందుకే తెలుగు సంభాషణలు పలికేటప్పుడు కాస్త ఇబ్బంది పడేవాడు. తర్వాత ఆ ఇబ్బందిని తక్కువ టైమ్ లోనే అధిగమించాడు.

కలియుగ పాండవులు తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్ని ఫ్లాపుల తర్వాత చేసిన శ్రీనివాస కళ్యాణం మంచి విజయం సాధించింది. వెంకీ సంపన్న కుటుంబంలో పుట్టినా.. ఆడంబరాలకు దూరంగా ఉన్నాడు. బాయ్ నెక్ట్స్ డోర్ అన్నట్టుగా కనిపిస్తాడు. అందుకే శ్రీనివాసకళ్యాణంలో ఆ లుక్ కుదిరింది. అటుపై కె విశ్వనాథ్ తో చేసిన స్వర్ణ కమలం వెంకీ కెరీర్ ను మంచి మలుపు తిప్పింది.

స్వర్ణకమలంలోని పాత్ర కోసం వెంకీ ప్రాణం పెట్టాడనే చెప్పాలి. విశ్వనాథ్ ను మెప్పించడం అంత సులువు కాదు. తనదైన నటనతో విశ్వనాథ్ నే కాదు.. అఖిలాంధ్ర ప్రజలను మెప్పించాడు.

అలాగే ప్రేమ చిత్రంలో అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉన్న లవర్ బాయ్ గా అద్భుతంగా నటించాడు. ఈ మూవీకి తొలిసారిగా ఉత్తమ నటుడుగా నంది అవార్డ్ అందుకున్నాడు. అయితే అప్పటికే చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు మాస్ హీరోలుగా రాణిస్తున్నారు. నాగార్జున కూడా ఓ రకంగా మాస్ ను మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు.దీంతో వెంకీకి కూడా అలాంటి కథ కావాలని ప్రయత్నించిన సురేష్ బాబు ఓ హాలీవుడ్ మూవీని ఇన్స్ స్సైర్ గా తీసుకుని బొబ్బిలిరాజా చేశారు. బొబ్బిలి రాజా బ్లాక్ బస్టర్ అవడమే కాదు.. వెంకీకి ఓవర్ నైట్ మాస్ ఇమేజ్ తెచ్చింది.

బొబ్బిలి రాజా తర్వాత చేసిన చంటి సినిమా వెంకీని ఫ్యామిలీ ఆడియన్సెస్ కు దగ్గర చేసింది. అప్పుడు మొదలైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది వెంకీకి.

అలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నాయుడుగారబ్బాయి కాస్తా తెలుగు టాప్ ఫోర్ హీరోస్ లో ఒకడుగా మారాడు. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. వయసుకు మించిన పాత్రలతో మెప్పించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ.. మిగతా ముగ్గురి ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుని రేర్ స్టార్ గా మారాడు వెంకీ. చినరాయుడు, సూర్యవంశం, జయం మనదేరా, గణేశ్, ధర్మచక్రం, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి.. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి వెంకీ కెరీర్. ఇలాంటి కెరీర్ స్పాన్ తెలుగులోనే కాదు.. అంత స్టార్డమ్ ఉన్న ఏ హీరోకూ ఏ భాషలోనూ లేదంటే అతిశయోక్తి కాదు.

ఇక తెలుగులో మరే స్టార్ హీరోకూ సాధ్యం కానీ స్థాయిలో ఏకంగా ఉత్తమ నటుడుగా ఏడు నంది అవార్డులు, ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న ప్రతిభ వెంకటేష్ ది. మరి విక్టరీ వెంకటేష్ అనే మాట ఊరికే వస్తుంది.

ప్రస్తుతం వెంకీ కెరీర్ లో కొత్త ఫేజ్ నడుస్తోంది. ఈ సారి మంచి కథలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన రీమేక్ చిత్రాలతో మళ్లీ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ఆ క్రమంలోనే చేసిన దృశ్యం, దృశ్యం2 చిత్రాలతో పాటు నారప్ప మూవీతో హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తోన్న వెంకీ తనదైన శైలిలో మరింతగా మనల్ని ఆకట్టుకోవాలని కోరుకుంటూ ఈ ఒన్ అండ్ ఓన్లీ.. విక్టరీ స్టార్ కు హ్యాపీ బర్త్ డే చెబుదాం..

- బాబురావు కామళ్ల.

Tags

Read MoreRead Less
Next Story