ఇద్దరు మహిళలపై కర్రలతో దాడి.. ఓ వ్యక్తిని గొంతుకోసి చంపేసిన దుండగలు

ఇద్దరు మహిళలపై కర్రలతో దాడి.. ఓ వ్యక్తిని గొంతుకోసి చంపేసిన దుండగలు

ఘర్షణలు, దాడులతో తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీ ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. చింతూరు మండలంలోని నర్సింగపేట గ్రామానికి చెందిన పార్షిక భద్రయ్య అనే 55 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు..గొంతుకోసి అతి కిరాతకంగా చంపేశారు. అదే రోజే... పక్కనే ఉన్న పాలగూడెం గ్రామానికి చెందిన అన్నెం వేణు గోపాల్ అనే వ్యక్తిపైనా కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో వేణుగోపాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు అడ్డొచ్చిన సున్నం ఈరమ్మతో పాటు మరో మహిళను కర్రలతో చితకబాదారు. ఇదంతా చూస్తున్న ఆ ప్రాంత గిరిజనులు ఒక్కసారిగా ఏంజరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు.

ఆర్ధిక వ్యవహారాలే ఈ గొడవలకు కారణమని తెలుస్తోంది. భద్రయ్యకు.. ఛత్తీస్ గడ్ లోని దుర్మాన్గ్ అనే గ్రామానికి చెందిన వ్యక్తులతో గతంలో నగదు వ్యవహారానికి సంబంధించిన గొడవలున్నట్లు తెలుస్తోంది. ఆ గ్రామానికి చెందిన కొంత మంది.. అతని వద్దకు డబ్బులు అడగటానికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మాట మాట పెరగడంతో.. దుండగులు... భద్రయ్య గొంతుకోసి చంపేసారని తెలుస్తోంది. ఈ గొడవలో అడ్డొచ్చిన ఇద్దరు మహిళను సైతం.. కర్రలతో దాడి చేశారు దుండగులు.

ఇది ఇలా ఉంటే పక్కనే ఉన్న పాలగూడెం గ్రామానికి చెందిన వేణు గోపాల్ అనే వ్యక్తిపైనా దాడి జరిగింది. ఈ దాడి ఎవరూ చేశారన్నది అంతుచిక్కడం లేదు. భూమికి సంబంధించిన తగాదాలు ఉండట వల్లే ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వేణుగోపాల్‌ ప్రస్తుతం భద్రాచలం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వెంట వెంటనే వరుస దాడులు జరగడంతో ఈ ప్రాంత గిరిజనులు ఉలిక్కి పడ్డారు. విషయం తెలుసుకున్న చింతూరు DSP ఖాదర్ బాషా పోలీసులు సహాయంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి..దర్యాప్తు ప్రారంభించారు.ఈ ప్రాంతమంతా ఛత్తీస్ గడ్ సమీపంలో ఉండటంతో పాటు,మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ సంఘటనలకు ప్రాధాన్యం సంతరించుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు రంగంలో దిగారు.


Tags

Read MoreRead Less
Next Story