బీటెక్‌ విద్యార్థిని హత్యకేసులో నిందితుడు అరెస్ట్‌

Btech Student Murder Case: గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై బీటెక్‌ విద్యార్థినిని హత్య చేసిన మృగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు..

బీటెక్‌ విద్యార్థిని హత్యకేసులో నిందితుడు అరెస్ట్‌
X

గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై బీటెక్‌ విద్యార్థినిని హత్య చేసిన మృగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిపాడులో శశికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అయితే, పోలీసులను చూడగానే శశికృష్ణ చేతులు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని నర్సరావుపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.. అయితే, శశికృష్ణను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజునే యువతి హత్యోదంతం పెను విషాదాన్ని నింపింది.. బీటెక్‌ విద్యార్థిని రమ్యను నడిరోడ్డుపై నడిరోడ్డుపైనే యువకుడు అతి దారుణంగా చంపాడు.. కత్తితో ఆమె గొంతులో పొడిచి చంపేశాడు. ఆ వెంటనే ఎవరికీ దొరక్కుండా పరారయ్యాడు. కాకాణి రోడ్డులోని పరామయకుంటలో ఈ ఘటన జరిగింది.. ఈ కేసులో లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు.. ఘాతుకానికి ఒడిగట్టింది శశికృష్ణగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. హత్య చేయడానికి ముందు ఎనిమిది నిమిషాలపాటు రమ్యతో నిందితుడు మాట్లాడినట్లు గుర్తించారు. నిందితుడికి, రమ్యకు మధ్య వాగ్వాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రమ్యతో శశికృష్ణ మాట్లాడే దృశ్యాలు సీసీఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

ఈ ఘటనలో హతురాలి సెల్‌ఫోన్‌ కీలకంగా మారింది. రమ్య సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రమ్య సోదరి మౌనికను కూడా పోలీసులు ప్రశ్నించారు. రమ్య హత్య జరిగిన సమయంలో మౌనిక కూడా పక్కనే ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. రమ్యతో మాట్లాడిన తర్వాత శశికృష్ణ హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. టిఫిన్‌ కోసం రమ్య బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని హతురాలి సోదరి మౌనిక పోలీసులకు చెప్పింది. టిఫిన్‌ బండి వద్ద ఓ యువకుడు మా చెల్లితో గొడవపడి కత్తితో పొడిచాడని పోలీసులకు వివరించింది. రోడ్డుపై పడి వున్న రమ్యను తానే ఆటోలో జీజీహెచ్‌కి తరలించినట్లు ఆమె చెప్పింది.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని రమ్య సోదరి మౌనిక పేర్కొంది. మరోవైపు గుంటూరు జీజీహెచ్‌లో రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు..

గుంటూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పట్టపగలు నడిరోడ్డు మీద అత్యంత దారుణంగా విద్యార్థిని రమ్యను హత్య చేయడం తీవ్రంగా కలచివేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకపాలనలో పట్ట పగలు ఆడపిల్ల సొంత ఇంట్లో ఉండాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలోనే ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృతమైపోయాయన్నారు. జగన్‌ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు చంద్రబాబు. దిశ చట్టం ప్రచారంపై పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణపై చూపడం లేదన్నారు. నిందితుణ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మరో మహిళకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

అటు ఈ ఘటనపై విపక్షాలు కూడా స్పందించాయి.. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. దిశ చట్టం తీసుకొచ్చామని సీఎం జగన్‌ ప్రసంగిస్తున్న సమయంలోనే దాడి జరిగిందని టీడీపీ నేతలున్నారు. రమ్యను హత్య చేసిన మృగాడిని కఠినంగా శిక్షించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు.. హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని ఆయన ఫోన్‌లో పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Next Story

RELATED STORIES