Karnataka girl kills parents: అమ్మానాన్న చెల్లిని, తమ్ముడినే ప్రేమగా చూస్తున్నారని..

Karnataka girl kills parents: అమ్మానాన్న చెల్లిని, తమ్ముడినే ప్రేమగా చూస్తున్నారని..
Karnataka girl kills parents: చెల్లికి, తమ్ముడికే ప్రేమనంతా చూపిస్తూ.. ఏం చేసినా వెనకేసుకొస్తున్నారు.. అక్క జీర్ణించుకోలేకపోయింది.. పగతో రగిలిపోయింది.

Karnataka girl kills parents: ఇంట్లో ఇద్దరు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు.. అమ్మానాన్న సరేసరి.. ఆఖరికి బామ్మ కూడా చెల్లికి, తమ్ముడికే ప్రేమనంతా చూపిస్తూ.. ఏం చేసినా వెనకేసుకొస్తున్నారు.. అక్క జీర్ణించుకోలేకపోయింది.. పగతో రగిలిపోయింది.

ముందూ వెనుకా ఆలోచించకుండా రాగి జావలో విషం కలిపి అందర్నీ చంపేసింది.. కళ్లముందే కన్నవారు, రక్తం పంచుకుపుట్టిన తమ్ముడు, చెల్లి విలవిలలాడుతుంటే కన్నీరు మున్నీరైంది. తాను చేసిన తప్పేంటో తెలుసుకుని విలపిస్తోంది.

అయినవారందరూ దూరమై అనాధలా మిగిలిపోయింది. దోషిగా సమాజం వేలెత్తి చూపిస్తుంటే కటకటాల్లో జీవితాన్ని గడపవలసివస్తోంది. క్షణికావేశంలో చేసిన తప్పు జీవితంలో సరిదిద్దుకోలేనిదిగా మిగిలిపోయింది.

కర్ణాటకలోని దావణగెరెలో 17 ఏళ్ల బాలిక తన కుటుంబ సభ్యులకు విషపూరిత ఆహారాన్ని అందించి వారి మరణానికి కారణమైంది.

పోలీసుల నివేదిక ప్రకారం, బాలిక ఆమె ఇతర తోబుట్టువుల పట్ల తల్లిదండ్రులు అప్యాయంగా ఉండడం, తన పట్ల చులకనగా ఉండడం అవమానంగా భావించి కలత చెందింది. విషప్రయోగం నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకున్న ఆమె తమ్ముడు గత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను జువైనల్ కోర్టుకు పంపారు.

ఈ సంఘటన జూలై 12 రాత్రి జరిగింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం, బాలిక తన కుటుంబానికి పురుగుమందు కలిపిన రాగి జావ తల్లిదండ్రులకు, బామ్మకు, చెల్లి, తమ్ముడికి ఇచ్చింది. 80 ఏళ్ల అమ్మమ్మ, 45, 40 సంవత్సరాల వయస్సు గల తల్లిదండ్రులు, 16 ఏళ్ల సోదరి ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే మరణించారు. సోదరుడు చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

చిత్రదుర్గ ఎస్పీ రాధిక మాట్లాడుతూ.. ఆ అమ్మాయి తన తల్లి తాతల ఇంటిలో పెరిగి మూడేళ్ల క్రితం తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నప్పుడు చెల్లిని, తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు ఆమె భావించింది అని ఎస్పీ చెప్పారు.

దీనికి తోడు బాలిక చదువులో కూడా వెనుకబడి ఉండడంతో తల్లిదండ్రులు తరచు ఆమెను మందలించేవారు, అప్పుడప్పుడు కొట్టేవారని బాలిక పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. కూలి పనులకు కూడా పంపేవారు. దీంతో తనపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకుంది. వారిని చంపాలని నిర్ణయించుకుంది.

బాలిక తన కుటుంబంపై విషప్రయోగం చేయడం ఇది రెండవసారి. దాదాపు ఆరు నెలల క్రితం, ఆమె సాంబార్‌‌లో పురుగుమందు కలిపింది. అయితే అన్నంతినే ముందు సాంబార్ వాసన వస్తుందని గుర్తించి కుటుంబం దాన్ని తినలేదు. దాంతో అప్పుడు ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే, వారికి బాలికపై ఏ మాత్రం అనుమానం రాలేదు. కానీ రెండో సారి రాగి జావలో విషం కలిపి ఇవ్వడంతో గుర్తించలేకపోయారు. అది తాగి అమ్మానాన్న, అమ్మమ్మ, చెల్లి ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు.

Tags

Read MoreRead Less
Next Story