ఆ గదే కావాలని పట్టుబట్టి మరీ.. మనస్వినిని తీసుకెళ్ళి..

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మనస్విని పరిస్థితి విషమంగానే ఉంది. రెండు రోజులు గడిస్తేగాని యువతి ఆరోగ్యపరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్పారు. మనస్వినికి మెడ భాగం లోతుగా కట్‌ అయ్యిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బృందావన్‌ లాడ్జిలో సీసీ టీవీ దృశ్యాలతో పాటు నిందితుడు వెంకటేశ్‌ అక్కడ సమర్పించిన ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌… బడంగ్‌పేటకు చెందిన మనస్విని ఇద్దరికీ ఓ బ్యాంక్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం ఏర్పడింది. వెంకటేశ్‌ ప్రవర్తన నచ్చని యువతి గత కొంతకాలంగా అతడిని దూరంగా ఉంచింది. దీంతో మనస్వినిపై కక్ష పెంచుకున్నాడు. బృందావన్‌ లాడ్జిలో గదిని నిన్ననే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వెంకటేశ్‌ మంగళవారం ఉదయం 10గంటల సమయంలో మనస్వినితో కలిసి వచ్చాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన స్నేహితురాలితో కలిసి వచ్చినట్టు లాడ్జి రికార్డులో పేర్కొన్నాడు.

పక్కా ప్రణాళిక ప్రకారమే ఆమెపై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకటేశ్‌ ఉదయం లాడ్జి వద్దకు చేరుకోగానే.. ముందుగా తాను బుక్‌ చేసుకున్న గదిని కాకుండా 501 నంబర్‌ గదినే తనకు కావాలని పట్టుబట్టాడు. ఆ గది ఫ్లోర్‌లో చివరిన ఉండటంతో ఒకవేళ గొడవ జరిగినా ఎవరికీ తెలిసే అవకాశం ఉండదని భావించడం వల్లే ఆ గదిని కావాలని కోరినట్టు తెలుస్తోంది. ఆ గది కేటాయించేందుకు సిబ్బంది ససేమిరా అన్నప్పటికీ.. అదే కావాలని పట్టుబట్టడంతో ఆఖరికి దాన్నే కేటాయించారు. దీంతో 501 గది వద్దకు మనస్వినితో కలిసి వెళ్లాడు. గది వద్దకు వెళ్లినప్పుడు కాస్త బాగానే ఉన్నా కొద్దిసేపటి తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు గమనించింది. అనంతరం వారిద్దరి మధ్య వాగ్వాదం.. మధ్యాహ్నం 12 గంటల వరకు సాగినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆ గది నుంచి కేకలు వినబడటంతో ఫ్లోర్‌బాయ్‌ అప్రమత్తమై 501 గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించాడు. ఆ తలుపులు తెరచుకోకపోవడంతో విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా.. మనస్విని అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో ఆమెను ఓమ్నీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉంది.

లాడ్జి వద్దకు చేరుకున్నప్పటి నుంచి వెంకటేశ్‌ ప్రవర్తనను గమనించిన మనస్విని.. అతడి నుంచి తనకు ముప్పు పొంచి ఉందని పసిగట్టి తండ్రికి వాట్సాప్‌లో సందేశంతో పాటు లొకేషన్‌ను షేర్‌ చేసింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన యువతి తల్లిదండ్రులు బయల్దేరి వచ్చేలోపే వారిద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో  వెంకటేశ్‌ మనస్విని గొంతు కోసి ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే, రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించడం.. పోలీసులు, యువతి తల్లిదండ్రులు అక్కడకి చేరుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన యువకుడు లాడ్జిలోని గది తలుపులు మూసుకొని బాత్‌రూంలోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పొలీసులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మనస్విని బీటెక్‌ పూర్తిచేసి బ్యాంక్‌ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నట్టు సమాచారం. అయితే, ఎప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఉంది? వెంకటేశ్‌ ఒకేసారి ఇలా ఉన్మాదిగా మారి యువతి గొంతు కోసేందుకు దారితీసిన పరిస్థితులేంటి? వీరిద్దరి మధ్య గొడవ తలెత్తడానికి కారణాలేంటనే దానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *