మదనపల్లి జంట హత్యల కేసులో నమ్మలేని నిజాలు!

మదనపల్లి జంట హత్యల కేసులో నమ్మలేని నిజాలు!
పద్మజ చేతులు తిప్పుతూ నేనే శివ అంటూ గట్టిగా కేకలు వేసింది.

కన్న కుమార్తెలను చంపిన పశ్చాత్తాపం లేదు.. నేను కాళికను.. శివుడిని అని అరుపులు.. మదనపల్లి జంట హత్యల కేసు నిందితురాలు పద్మజ వ్యవహారశైలి ఇది. ఆదివారం జరిగిన అలేఖ్య, సాయిదివ్య హత్య కేసుల్లో నిందితులైన తల్లిదండ్రులను అరెస్టు చేసేందుకు పోలీసులు మంగళవారం పురుషోత్తంనాయుడు ఇంటి వద్దకు వెళ్లారు. వారిని ఇంటి బయటకు తీసుకువచ్చేటప్పుడు.. పద్మజ చేతులు తిప్పుతూ నేనే శివ అంటూ గట్టిగా కేకలు వేసింది. అనంతరం కరోనా టెస్టుల సమయంలోనూ నాకు కరోనా టెస్ట్ ఏంటి.. నేను శివుడిని అని.. వింత వింతగా ప్రవర్తించారు. భర్త పురుషోత్తంనాయుడును నువ్వు నా భర్తే కాదని పక్కకు తోసేసింది.

నిందితుల ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల నుంచి ఏడు రోజుల ఫుటేజీని సేకరించామని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఇంట్లో హత్యలకు ముందు రెండు రోజుల క్రితం ఓ మంత్రగాడు వచ్చి పూజలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా పూర్తి విచారణ చేస్తామన్నారు. సకాలంలో తమ సిబ్బంది వెళ్లకుంటే కుమార్తెలతో పాటు తల్లిదండ్రులూ మృతి చెందేవారని పేర్కొన్నారు. ఇంట్లో ధైవభక్తితో అద్భుతాలు జరుగుతున్నాయని, తమ కుమార్తెలు చనిపోయినా మళ్లీ బతికి వస్తారని మూఢవిశ్వాసంతో చంపేసినట్లు విచారణలో తెలిసిందన్నారు.

పద్మజ, పురుషోత్తంనాయుడుల మానసిక పరిస్థితి సక్రమంగా లేదని గుర్తించానని ప్రభుత్వాసుపత్రి మానసిక వైద్యులు తెలిపారు. వారిద్దరూ ఆధ్యాత్మికతను మించిన ట్రాన్స్‌లో ఉన్నారని పేర్కొన్నారు. పద్మజ తండ్రి డెల్యూషన్స్ అనే వ్యాధితో మృతిచెందారని.. ఆమె మేనత్త కూడా ఈ వ్యాధిగ్రస్తురాలని.. దీంతో పద్మజ కూడా ఈ వ్యాధితో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. డెల్యూషన్స్ వ్యాధిని భర్తతో పాటు కుమార్తెలకు పద్మజ అంటించిందని తెలిపారు.

డెల్యూషన్స్ వ్యాధి ఉన్న వ్యక్తులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారని వైద్యులు చెబుతున్నారు. తాము ఊహించుకున్నదే నిజమని నమ్ముతుంటారని తెలిపారు. వికారమైన రీతిలో అసాధారణ భ్రమలు కలిగి ఉంటారని.. వీరు ఆ భ్రమలే నిజమని జీవిస్తుంటారని వెల్లడించారు. ఈ వ్యాధి ఉన్న వారు చాలా ప్రమాదకరమని.. చివరికి ప్రాణాలు కూడా తీసుకోవడానికి వెనుకాడరని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story