ఛీ.. మీరసలు కన్నవాళ్లేనా.. మీ కూతుర్ని ఆ దుర్మార్గుడు..: శునకం పశ్చాత్తాపం

ఛీ.. మీరసలు కన్నవాళ్లేనా.. మీ కూతుర్ని ఆ దుర్మార్గుడు..: శునకం పశ్చాత్తాపం
వికలాంగురాలైన తమ కూతురిని తమతో పాటు ఇంట్లో ఉంచుకోకుండా ఇంటి బయట ఆమెకు ఓ రేకుల షెడ్డు నిర్మించి అందులో ఉంచారు.

బిడ్డ ఎలా ఉన్నా కనిపెంచిన తల్లి కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది. మానసిక వికరాంగులైన బిడ్డను మరింత జాగ్రత్తగా కాపాడుకుంటుంది. కానీ ఆ తల్లిదండ్రులు కూతురిని తమతో పాటు ఇంట్లో ఉంచుకోకుండా ఇంటి బయట ఆమెకు ఓ రేకుల షెడ్డు నిర్మించి అందులో ఉంచారు. ఆపద వస్తే అరిచేందుకు ఆమెకు నోరులేదు.. కామాంధుడు మీద పడితే కాలుతో తన్నేందుకు కాళ్లు కూడా సరిగా పని చేయవు.

ఆమె దౌర్భాగ్యాన్ని కాపలా కుక్క కళ్లారా చూసింది. అత్యాచారం చేయబోయిన ఆ దుర్మార్గుడి పిక్క పట్టుకుని లాగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికరాంగురాలు కావడంతో తల్లిదండ్రులు ఆమె కోసం ఓ షెడ్డు నిర్మించి అందులో ఉంచారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలు ఉన్న షెడ్డులోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షెడ్డులో పవర్ కట్ చేశాడు.

దిలీప్ కుమార్ చర్యలను దూరం నుంచి గమనిస్తున్న ఆ ఇంటి పెంపుడు కుక్క అతడి వెనకే షెడ్డులోకి ప్రవేశించింది. అతడి కాలు పట్టుకుని గట్టిగా లాగే ప్రయత్నం చేసింది. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయిన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుక్క మాత్రం అతడిని విడిచి పెట్టలేదు. గట్టిగా అరుస్తూ ఇంట్లో వాళ్లని మేల్కొలిపింది.

దాని అరుపులకు బయటకు వచ్చిన వికలాంగురాలి తల్లిదండ్రులు దిలీప్ కుమార్‌ను గమనించారు. వెంటనే ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సహాయంతో అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిలీప్ కుమార్ ఫోన్‌ని పరిశీలించగా అందులో మహిళల అసభ్యకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయి.

మానసిక వికరాంగురాలైన కన్నబిడ్డను కనికరం లేకుండా షెడ్డులో ఉంచారని స్థానికులు తల్లిదండ్రులను విమర్శిస్తున్నారు. కుక్కకి ఉన్న విశ్వాసం కూడా తల్లిదండ్రులకు లేక పోయిందని అంటున్నారు. నోరున్న మనుషులకంటే నోరులేని మూగజీవాలే నయం అని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story