ఆన్‌లైన్‌లో హత్యలు.. సంప్రదించవలసిన చిరునామా.. బిట్టు బిజినెస్‌కి పోలీసులు చెక్..

ఆన్‌లైన్‌లో హత్యలు.. సంప్రదించవలసిన చిరునామా.. బిట్టు బిజినెస్‌కి పోలీసులు చెక్..

అరుణ్.. రవీనా.. విజయలక్ష్మి

సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు ఎన్నింటికో వేదిక అవుతోంది. ఫేస్‌బుక్కులు, వాట్సప్‌ల్లో ప్రేమ ప్రవహించేస్తోంది.

నువ్వాదరిని నేనే దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనేది పాత పాట.. ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడ ఉన్నవారినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే ఆవేశంతో హత్యలు కూడా చేసేస్తున్నారు.. అదీ ఆన్‌లైన్ వేదికగా. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు ఎన్నింటికో వేదిక అవుతోంది. ఫేస్‌బుక్కులు, వాట్సప్‌ల్లో ప్రేమ ప్రవహించేస్తోంది. అలానే ఒక్కటయ్యారు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన అరుణ్ కుమార్, మంచిర్యాల నివాసి రవీనాలు. గత ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నారు.

పెళ్లికి ముందు ప్రేమ అంటూ వెంటపడ్డ అరుణ్ కుమార్‌కి పెళ్లయ్యాక కట్నం కావాలని వేధించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ. దాంతో పుట్టింటికి వచ్చేసింది రవీనా. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఈ గొడవల్లో బిడ్డ పుడితే కష్టమని రవీనా తల్లి విజయలక్ష్మి కూతురికి అబార్షన్ చేయించింది. దీంతో భార్యపై, అత్తపై అరుణ్ పగ పెంచుకున్నాడు. ఇద్దర్నీ ఒకేసారి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

అంతర్జాలం అన్నిటికీ వేదిక అని తెలిసి స్మార్ట‌ఫోన్‌లో సెర్చ్ చేశాడు. యూట్యూబ్‌లో విజయవాడకు చెందిన సుపారీ కిల్లర్ బిట్టూ ఐడీ కనిపించింది. హత్యలు చేయడానికి కావలసిన అన్ని సామాగ్రి అమ్ముతాం, అవసరమైతే కిడ్నాప్‌లు, హత్యలు కూడా చేసి పెడతాం అని రాసి ఉంది. వెతకబోయిన తీగ కాలికే దొరికినంత ఆనందంతో అరుణ్ అతడిని వాట్సప్‌లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించాడు. అవతలి వ్యక్తి తనని బిట్టూగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దర్ని చంపాలంటే రూ.10 లక్షలు ఖర్చవుతుందన్నాడు బిట్టు.

దానికి అరుణ్ నా దగ్గర అంత డబ్బు లేదు. అత్తవారింట్లో రూ.4 లక్షల నగదు, 20 తులాల బంగారం ఉంది. వాళ్లని చంపి అవి తీసుకో అని చెప్పాడు. దాంతో బిట్టు సరేనంటూ హత్యలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. తెనాలికి చెందిన సుబ్బుని తోడు తీసుకుని ఈనెల 17న మంచిర్యాలకు వెళ్లాడు. అరుణ్ వారిని కలిసి అత్తవారింటి అడ్రస్ చెప్పాడు. ఈ నెల 18న ఉదయం 3 గంటలకు ఇంటి గోడ దూకి మేడపైకి వెళ్లి మాటు వేశారు. ఉదయం 5 గంటలకు బయటికి వచ్చిన విజయలక్ష్మిపై ముగ్గురూ దాడి చేసి హత్య చేశారు. శబ్దంతో నిద్రలేచి బయటకు వచ్చిన రవీనాను కూడా ఇదే తరహాలో చంపేశారు. తర్వాత వారి శరీరంపై ఉన్న నగలు తీసుకుని ఉడాయించారు. పోలీసులు ఈ కేసును చేధించి ఈనెల 28న అరుణ్‌, బిట్టు, సుబ్బులను అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన జుజ్జవరపు రోషయ్య అలియాస్ బిట్టు డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. యూట్యూబ్‌లో ఓ పోస్ట్ చూశాడు. రూ.30 వేలకు గన్ను అమ్ముతున్నారని తెలిసి డబ్బు పంపించాడు. కానీ గన్ రాలేదు. ఇదే తరహాలో తాను కూడా ఇతరులను మోసం చేయాలి ఆన్‌లైన్‌లో గన్ ఫర్ సేల్ అని పోస్ట్ పెట్టి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇటీవల తన పోస్ట్‌కి మరికొన్ని డిగ్రీలు యాడ్ చేశాడు.. సుపారీ కిల్లర్ విజయవాడ అని ఐడీని క్రియేట్ చేసి, ఆయుధాలు అమ్ముతాం, సుపారీ తీసుకుని హత్యలు, కిడ్నాప్‌లు చేస్తామని ప్రకటించాడు.

ఇక సుబ్బు బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. తెనాలికి చెందిన దండం వెంకట సుబ్బారావు అలియాస్ సుబ్బు.. తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళను హత్య చేసే క్రమంలో ఆన్‌లైన్‌లో బిట్టును సంప్రదించాడు. దీనికి రూ.2 లక్షలు ఖర్చవుతుందని బిట్టు చెప్పగా అంతడబ్బు తన దగ్గర లేదన్నాడు. దానికి బిట్టు సరే నాతో చేయి కలుపు. ఇద్దరం కలిసి హత్యలు చేద్దామన్నాడు. అలా వచ్చిందే అరుణ్ హత్య చేయమన్న కేసు. తాను చేస్తున్న హత్యలలో సుబ్బుని భాగస్వామ్యం చేసి వచ్చిన డబ్బుని ఇద్దరూ పంచుకోవాలనుకున్నారు. ఈలోగా వాళ్ల ప్లాన్ బెడిసి కొట్టి పోలీసుల చేతికి చిక్కారు. ఇప్పుడు జైల్లో కూర్చుని ఊచలు లెక్కపెడుతున్నారు అని మంచిర్యాల సీపీ సత్యన్నారాయణ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story