మాజీ సీఎం మేనల్లుడు హత్యకేసులో వీడిన మిస్టరీ

మాజీ సీఎం మేనల్లుడు హత్యకేసులో వీడిన మిస్టరీ
రాపూరు గుండవోలు అటవీ ప్రాంతంలో సిద్ధార్థ మృతదేహాన్ని వెలికితీసి.. పోస్టుమార్టం నిర్వహించారు.

కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ మేనల్లుడు సిద్దార్థ హత్యకేసు మిస్టరీ వీడింది. సిద్దార్థను హత్య చేసిన అనంతరం.. నిందితులు మృతదేహాన్ని నెల్లూరు జిల్లా రాపూరు గుండవోలు అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. ఇప్పటికే ఈ హత్యకు ప్రధాన కారకులను బెంగళూరు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో నిందితుడు వినోద్‌ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గత నెల 19న సిద్ధార్థ అమెరికాకు వెళ్తున్నానని చెప్పాడు. అనంతరం అతని ఫోన్‌ పనిచేయలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధార్థను ఇద్దరు వ్యక్తులు హత్య చేసి నెల్లూరు జిల్లా రాపూరు గుండవోలు అటవీప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఎక్కడ తమ ఇంటికి వస్తారనే భయపడి.. ఇద్దరు నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి-రేణిగుంట మార్గంలోని రైలు కింద పడటానికి వినోద్‌ యత్నించడంతో కాలు, చేయి విరిగాయి. స్థానికులు, కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు.. అక్కడికి చేరుకుని వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇక మరో నిందితుడు శ్యాంసుందర్‌రెడ్డి.. నాలుగు రోజుల కిందటే తిరుపతి శ్రీనివాసం వెనుక ఉన్న తాళ్లపాక చెరువు ముళ్ల పొదల్లోని చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు.

ఇక ఇవాళ రాపూరు గుండవోలు అటవీ ప్రాంతానికి నిందితుడు వినోద్‌ను పోలీసులు తీసుకొచ్చారు. అనంతరం సిద్ధార్థ మృతదేహాన్ని వెలికితీసి.. పోస్టుమార్టం నిర్వహించారు.


Tags

Read MoreRead Less
Next Story