Tirumala : చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై వటపత్రశాయి అలంకారంలో ..!

Tirumala : చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై వటపత్రశాయి అలంకారంలో ..!
Tirumala : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి.. రోజుకో వాహనంపై మలయప్ప స్వామి వివహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు..

Tirumala : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి.. రోజుకో వాహనంపై మలయప్ప స్వామి వివహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.. సమస్త జీవరాశులకు పగలు, రాత్రి కీలకమైనవి. పగలు సూర్యుడు వెలుగు ఇస్తాడు. రాత్రి చంద్రుడు తన కిరణాలతో ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. ఈ ఇద్దరి వాహనాలపై ఊరేగడం ద్వారా సూర్య చంద్రులు తనకు రెండు నేత్రాలని భక్తకోటికి తెలియజేశారు.

సనాతన హైందవ సంప్రదాయంలో సూర్యారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని ఆదిమధ్యాంతరహితుడిగా పేర్కొంటారు. సూర్యారాధన వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. పగలు సూర్యప్రభ వాహనంలో విహరించిన వేంక‌టాచ‌ల‌ప‌తి రాత్రి అమృత కిరణాలు కలిగిన చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. చంద్రప్రభ వాహనంపై శ్రీవారి వైభవాన్ని తిలకించి భక్తకోటి పులకించిపోయింది. అడుగడుగునా నీరాజనాలు సమర్పించింది.

సూర్య చంద్రదాదులను తన వాహనాలుగా చేసుకుని భక్తులను కటాక్షించిన మలయప్పస్వామి రేపు మహా రథంపై విహరించనున్నారు. శ్రీవారి మహారథం విశ్వమానవుడికి ప్రతీక. సృష్టిలోని ప్రతి జీవరాశిలోనూ మహావిష్ణువు ఉన్నాడనే సత్యాన్ని చెప్పడానికి ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. జన్మరాహిత్యాన్ని కటాక్షించి, ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించేది రథోత్సవం. రథికుడు ఆత్మ, శరీరం రథం.. బుద్ధి సారథి.. మనస్సు పగ్గం.. ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు వీధులు.. ఉపనిషత్తులు చేసే ఈ బోధ స్థూలశరీరం, సూక్ష్మ శరీరం వేర్వేరని, ఆత్మ అందుకు భిన్నమైన జ్ఞానం కలిగిస్తుందని పండితులు చెబుతారు.

శ్రీవారి మహారథం తన గమనాన్ని గమ్యం వైపు నడిపించాలంటే తనువులోని దేవదేవుణ్ని ప్రాణప్రతిష్ట చేసుకుని, రథాన్ని లాగాల్సిందేనని పురాణాలు చెబుతున్నాయి. రథోత్సవం సమయంలో శ్రీహరిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం.

Tags

Read MoreRead Less
Next Story