Editorial: మన్యం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు

Editorial: మన్యం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు
ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఓటమే లక్ష్యంగా పుష్పశ్రీవాణి, ఆమె భర్త ముందుకు సాగుతున్నట్లు టాక్

కాలం కలిసిరానపుడు తాడే పామై కాటేస్తుందంటారు. ఇది మన్యం జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు అతికినట్లు సరిపోతుంది. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి, ఆమె భర్త మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజులతో పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా ముగ్గురు ఒక మాట అనుకుని సక్సెస్ చేసేవారు. కానీ ఏమైందో ఏమో గాని రెండేళ్లుగా వారు బద్ధ శత్రువుల్లా మారిపోయారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలు మినహా మిగతా సమయంలో ఎడ మొహం పెడ మొహంలా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల ముందు అరకు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడుగా ఉన్న శత్రుచర్ల పరిక్షీత్ రాజు కుటుంబంతో పార్వతీపురం నియోజకవర్గ అప్పటి వైసీపీ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు రాజకీయంగా సత్సంబంధాలు ఉండేవి ఈ నేపథ్యంలో పార్వతీపురం ఎమ్మెల్యే టికెట్ కోసం అలజంగి జోగారావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పరిక్షిత్ రాజు, పుష్పశ్రీ వాణిలు అండగా నిలిచినట్లు సమాచారం.

అప్పటికే నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా ఉన్న జమ్మాన ప్రసన్న కుమార్‌ను కాదని అలజంగి జోగారావుకు టికెట్ కేటాయించినట్లు అప్పట్లో పరీక్షిత్ రాజు బహిరంగ ప్రకటన చేయడంతో వారి మధ్య స్నేహం మరింతగా పెరిగినట్లు సమాచారం. అనంతరం 2019 ఎన్నికల్లో పార్వతీపురం నుండి అలజంగి జోగారావు, కురుపాం నుండి పాముల పుష్పశ్రీ వాణి లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో రెండో సారి గెలిచిన పుష్పశ్రీ వాణికి మంత్రి పదవి వరించింది. మంత్రిగా పుష్పశ్రీ వాణి ఉండటంతో తన నియోజకవర్గానికి కూడా ఉపయోగపడతారని భావించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు నిరాశే ఎదురయినట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రి పదవి పొందిన కొద్ది నెలలకే పుష్పశ్రీ వాణి దంపతుల వైఖరిలో మార్పురావడంతో వీరి స్నేహం బీటలు వారినట్లు ప్రచారం జరుగుతోంది. తన సొంత నియోజకవర్గం కురుపాం లోనే కాకుండా పార్వతీపురం నియోజవర్గంపైనా పట్టు సాధించేందుకు పరీక్షిత్ రాజు కుటుంబం ప్రయత్నించడంతో వ్యవహారం బెడిసికొట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో పుష్పశ్రీవాణి ఎత్తులను చిత్తు చేయడంతో ఎమ్మెల్యే జోగారావుతో పుష్పశ్రీ వాణి విభేదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే జోగారావుకి వ్యతిరేకంగా వర్గపోరును పుష్పశ్రీవాణి ప్రోత్సహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావహులను తెరపైకి తెచ్చి ఎమ్మెల్యే జోగారావుపైకి ఎగదోస్తున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో ఏడాది కిందట జిల్లా వైసీపీ కార్యాలయ శంకుస్థాపన విషయంలో బాధ్యతలను మొత్తం స్థానిక ఎమ్మెల్యే జోగారావుకు కాకుండా జమ్మాన ప్రసన్నకుమార్‌కు జిల్లా వైసీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అప్పగించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన ఎమ్మెల్యేకు కాకుండా వేరే వ్యక్తికి ఆ బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ జోగారావు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండిపడరట. ఈ తంతు ముగిసింది అనుకునే టైం లోపే మరొక ప్లాన్‌కు పరీక్షిత్ రాజు దంపతులు తెరదీసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్వతీపురం ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావహులందరినీ ఒక్క తాటి పైకి తెచ్చి ఎమ్మెల్యే జోగారావుకు పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు టికెట్ ఆశిస్తున్న అశావహులకు అండగా ఉంటానని పరీక్షిత్ రాజు భరోసా ఇస్తున్నట్లు కూడా జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అంతడితో ఆగకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలకు పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ ఆశలు కల్పిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఓటమే లక్ష్యంగా పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజులు ముందుకు సాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పుష్ప శ్రీవాణి దంపతులు అసమ్మతి నేతలను ఎగదోస్తున్నట్లు ఎమ్మెల్యే జోగారావు వైసీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరి జోగారావు ఫిర్యాదుపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story