Editorial: కనిగిరి వైసీపీలో కిరికిరి..?

Editorial: కనిగిరి వైసీపీలో కిరికిరి..?
ద్వితీయ శ్రేణి నేతలు ఢీ అంటే ఢీ అంటుండటంతో చుక్కాణి లేని నావలా వైసీపీ తయారైందని చర్చ జరుగుతోంది


2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నాయకుడు.., ఇప్పుడు దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షులా కాలం వెళ్లదీస్తున్నారా ? ఓ పక్క రెడ్డి సామాజికవర్గం.., మరోపక్క సొంత సామాజికవర్గాన్ని వ్యతిరేకం చేసుకుని సీటుకే ఎసరు తెచ్చుకున్నారా? టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నా.., అధిష్ఠానం మొండిచేయి చూపనుందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో బులుగు జెండా చీలికలు పేలికలు అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వర్గపోరు, ప్రజావ్యతిరేకతో వైసీపీకి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు అసమ్మతి నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మదుసూధన్ యాదవ్ కి చుక్కలు చూపిస్తున్నారు. 2014లో ఓడిపోయినా.., సామాజిక సమీకరణల నేపథ్యంలో 2019లో టికెట్ తెచ్చుకుని బుర్రా మదుసూధన్ యాదవ్ విజయ సాధించడంలో రెడ్డి, యాదవ సామాజికవర్గం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆ రెండు వర్గాల నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జట్టుకట్టడంతో బుర్రాకు పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు.

ఓవైపు ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే.., మరోవైపు అస్థిత్వం కోసం ద్వితీయ శ్రేణి నేతలు ఢీ అంటే ఢీ అంటుండటంతో కనిగిరిలో వైసీపీ పరిస్థితి చుక్కాణి లేని నావలా తయారైందని చర్చ జరుగుతోంది. వైసీపీకి అండగా ఉండే రెడ్డి, ఎమ్మెల్యే సామాజికవర్గమైన యాదవ నేతలు అధిష్టానానికి, సజ్జలకు.., మధుసూదన్ యాదవ్ తీరుపై పదే పదే ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు.., ఎమ్మెల్యేకు ఎదురుగాలి వీస్తున్నట్లు . జగన్ నిర్వహించిన సర్వేలలో తేలినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కనిగిరిలోని పార్టీని చక్కదిద్ది ట్రాక్ లో పెట్టేందుకు మాజీ మంత్రి బాలినేని చేసిన ప్రయత్నాలు విఫలమయినట్లు సమాచారం. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం రాజీకి రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్రూప్ వార్‌ని కట్టడి చేసేందుకు కనిగిరి వెళ్లిన ఎమ్మెల్యే బాలినేని సైతం.., బుర్రా నివాసానికి వెళ్లకపోవడం కూడా కనిగిరిలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈసారి బుర్రాకు టికెట్ డౌటే అనే అనుమానాలు నియోజకవర్గంలో షికార్లు చేస్తున్నాయి.

మరోవైపు.., వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.., ఏదో విధంగా నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకున్నా ఎమ్మెల్యే సూది దూరేంత సందుకూడా ఇవ్వడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులను కూడా వదిలిపెట్టకుండా ఎమ్మెల్యేనే చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. చివరకు కనిగిరిలో కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసే కాంట్రాక్టు కూడా ఎమ్మెల్యే చేస్తున్నారని.., ఆస్తులు అమ్ముకుని పార్టీకోసం పనిచేసిన తమ చేతికి చిప్పే మిగిలిందని అధిష్టానానికి ద్వితియశ్రేణి నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

దీంతోపాటు.., కనిగిరి వైసీపీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పావులు కదుపుతుండడం నియోజకవర్గంలో హీట్‌ పెంచుతోంది. గడప గడపకు కార్యక్రమానికి ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యేను..., నాలుగేళ్ల నుంచి ఏమి చేశావంటూ ప్రజలు నిలదీస్తున్న ఘటనలు పరిపాటిగా మారాయని చర్చ జరుగుతోంది. ప్రజా వ్యతిరేకత, పార్టీలోని వర్గపోరుతో ఈసారి బుర్రాకు టికెట్ దక్కడం అనుమానమేనని ఒకవేళ టికెట్ దక్కించుకున్నా.., రెడ్డి సామాజికవర్గాన్ని, సొంత సామాజికవర్గమైన యాదవులను దూరం చేసుకుని ఆయన గట్టెక్కడం కష్టమేనని వైసీపీ పార్టీ నేతలే చెవులు కొరుక్కొంటున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story