Editorial: అధికారం అన్నది పెత్తనం తమ్ముడిది...?

Editorial: అధికారం అన్నది పెత్తనం తమ్ముడిది...?
శృతిమించుతోన్న ఆదిమూలపు అన్నదమ్ముల ఆగడాలు

కర్నూలు రాజకీయాల్లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరుడి ఆగడాలు మితిమీరి పోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే అన్న అధికారం అండతో తమ్ముడు ఆదిమూలపు సతీష్ కర్నూలు జిల్లాలో రెచ్చిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలల క్రితం పార్టీ అధినేత మెప్పుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ ..రోడ్డు మీద చొక్కా చించుకుని అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. మంత్రి సురేష్ అప్పట్లో ప్రవర్తించిన తీరుతో అధినేతను మెప్పించగలిగాడో లేదో గానీ నియోజకవర్గంలో మాత్రం మంత్రి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయినట్లు ప్రచారం జరిగింది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అడ్డు తగలడమేంటని..అదిమూలపు సురేష్ తీరు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తాజాగా ఆదిమూపులపు సురేష్ సోదరుడు అన్నను మించిపోయాడని టాక్ జోరుగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో మంత్రి సోదరుడు భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్న అధికారాలను అడ్డుపెట్టుకుని ఆదిమూలపు సతీష్ కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి ఉన్న విద్యాసంస్థల వ్యవహారాలను ఆయన సోదరుడు సతీష్‌ చూస్తుంటారు. కర్నూలు కలెక్టరేట్ కి వెనుక వైపున ఉన్న చైతన్య పురి కాలనీలో ప్రవేట్ విద్యా సంస్థలతో పాటు కర్నూలు అర్భన్ డవలప్ మెంట్ అథారిటీ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయానికి ఎదురుగానే మంత్రి ఆదిమూలపు సురేష్ నివాసం వారి విద్యా సంస్థలున్నాయి. అయితే ఇటీవలే మంత్ర సోదరుడు ఇంటి ముందు తల్లితండ్రుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు మంత్రులు ఆదిమూలపు సురేష్ ,ఆర్థిక మంత్రి బుగ్గన కూడా హాజరు అయ్యారు. అంతా బాగానే ఉన్న ఈ వ్యవహారం తీవ్ర వివాదస్పదంగా మారడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

విగ్రహాలను ఇంటి ముందు ఉన్న మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కాసులకు కక్కుర్తిపడిన మంత్రి సోదరుడు సతీష్‌ ఇంటి పక్కన మురుగు నీటి కాలువను ఆక్రమించి దానిపై వరుసగా షాపుల నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కోట్లు విలువ చేసే క్రీడా మైదానానికి చెందిన స్థలం కబ్జా చేశారని..సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఆయన సోదరుడి భూ అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని..కళ్ల ముందే..ఇంత అన్యాయం జరుగుతున్నా..మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక అన్న అమాత్యుడైతే ..అధికారం అండతో తమ్ముడు సతీష్ పెత్తనం చలాయిస్తున్నారని కర్నూలులో జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రితో తమకు ఇబ్బందులు ఎందుకని భావించిన మున్సిపల్ అధికారులు భయంతో మంత్రి తమ్ముడికి జీ హుజూర్ అంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే కమ్యూనిస్టుల ఆందోళనలు తీవ్రంకావడంతో మంత్రి సురేష్ ఆయన తమ్ముడు సతీష్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story