Editorial: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందా..?

Editorial: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందా..?
గత కొన్నేళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరు గులాబీ నేతలు ఒక్కటయ్యారా..? పుట్టినరోజు వేడుకల సందర్భంగా విభేదాలు మరిచారా? ఇరు నేతల మధ్య కోల్డ్ వార్ ముగిసినట్లేనా ? అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వీరి రాజకీయాలు నడుస్తున్నాయా..? ఎవరా పొలిటీషియన్స్, ఏంటా సయోథ్య?

ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతున్న గుత్తా సుఖేందర్ రెడ్డికి, జిల్లానుండి ప్రాతినిధ్యం వహిస్తూ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న కొనసాగుతున్న జగదీశ్ రెడ్డి ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇన్నాళ్లూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇరువురు నేతలు తాజాగా జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను మంత్రి జగదీశ్ రెడ్డి పిలిచి.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లుగా మంత్రి జగదీశ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాల నేపథ్యంలో మంత్రి పుట్టిన రోజు వేడుకలకు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అమిత్ రెడ్డి సైతం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. సుఖేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి లు ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వీరిద్దరూ ఒకటయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.

తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి మాత్రమే ఏకైక మంత్రిగా క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడుగా ఉన్న మంత్రి జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా.. జిల్లాలో మరో పవర్ పాయింట్ ఉండొద్దని గులాబీ బాస్ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలంతా దాదాపు మంత్రి జగదీశ్ రెడ్డి వైపే కొనసాగుతున్నారు. గతంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంట వచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ లు సైతం.. 2018 ఎన్నికల తర్వాత మారిన సమీకరణాల నేపథ్యంలో వారంతా జగదీశ్ రెడ్డి వైపుకు టర్న్ అయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో జిల్లాలోని వర్గ పోరుకు చెక్ పెట్టే యోచనలో భాగంగానే గుత్తా, మంత్రి జగదీశ్ రెడ్డిలు కలిసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇదిలా ఉంటే.. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, కోదాడ, మునుగోడు నియోజకవర్గాలలో మాత్రం ఎమ్మెల్యేలకు సొంత పార్టీలోనే ప్రత్యర్ధులుగా గుత్తా వర్గానికి చెందిన నేతలు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్లగొండ సెగ్మెంట్లో.. మున్సిపాలిటీ రాజకీయాలు సహా నియోజకవర్గంలో గ్రూపులు.. అలాగే నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజారులో మున్సిపల్ దుకాణాల పంచాయతీలోనూ గుత్తా వర్సెస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కేంద్రాలుగా పాలిటిక్స్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవరకొండ నియోజకవర్గంలోను బీఆర్ఎస్ గుత్తా వర్గం, ఎమ్మెల్యే వర్గాలుగా చీలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఓవైపు.. గుత్తా వర్గానికి చెందిన చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ దేవేందర్ నాయక్ సహా ఇతర సీనియర్లంతా ఓవైపు ఉండి రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ లోను పలువురు ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇతర నియోజకవర్గ నాయకులు అంతా గుత్తా వైపు కొనసాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరోవైపు రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి సుఖేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. గత రెండు మూడేళ్లుగా.. గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో.. పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా కొనసాగుతున్న జగదీశ్ రెడ్డి మద్దతు లేకుండా వచ్చే అసెంబ్లీ లేదంటే పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగి నెగ్గుకురావడం సామాన్య విషయం కాదు. ఈ క్రమంలో ఇబ్బందులు తప్పవని భావించిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. తెలివిగా మంత్రి జగదీష్ రెడ్డికి దగ్గర అయ్యేలా తన కొడుకుని పకడ్బందీగా ట్రైనప్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేనా.. అమిత్ పాల్గొన్న ప్రతీ కార్యక్రమంలోనూ.. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా.. జరిగిన మంత్రి జన్మదిన వేడుకల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు అమిత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొనడం జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకే దారి తీసింది.

ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి తనయుడ్ని పాలిటిక్స్‌లో గ్రాండ్‌గా ప్రమోట్ చేసేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story