దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు.. 2,767 మంది మృతి..!

దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు.. 2,767 మంది మృతి..!
కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరాలు ఏవీ పనిచేయడం లేదు. కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతూ డైలీ మీటర్‌ను 3 లక్షల 50 వేలకు తీసుకెళ్లింది.

కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరాలు ఏవీ పనిచేయడం లేదు. కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతూ డైలీ మీటర్‌ను 3 లక్షల 50 వేలకు తీసుకెళ్లింది. గడిచిన 24 గంటల్లో 3 లక్షల 49 వేల 691 పాజిటివ్ కేసులు నమోదవగా.. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 2 వేల 767 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కొత్తగా 10 లక్షలకుపైగా కేసులు ఈ 3 రోజుల్లోనే నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది. అలాగే ఈ 3 రోజుల్లో 7500పైగా చనిపోవడంతో అంతులేని విషాదం నెలకొంది. చూస్తుంటే ఈ విలయం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదని వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెకండ్ వేవ్‌ ఇప్పటికీ మహారాష్ట్రలో అదే ఉధృతి కొనసాగిస్తోంది. అక్కడ నిన్న కూడా 67 వేల కేసులు నమోదయ్యాయి. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 39 వేల మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయితే.. కర్ణాటకలో 29వేలు, కేరళలో 26 వేల మందికి వైరస్ సోకింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 11 వేల 698 కేసులతో కరోనా విజృంభణ వ్యాప్తి కనిపిస్తుంటే.. తెలంగాణలో 7 వేల432 కేసులు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి వీకెంట్ కర్ఫ్యూలు, సండే మార్కెట్‌లు పూర్తిగా మూసేయిస్తున్నా కేసులు తగ్గకపోవడం ఈ కొత్త కరోనా వేరియంట్‌లు వారం రోజులకే మనిషిని మంచాన పడేస్తుండడం లాంటి పరిస్థితులతో ఎక్కడికక్కడ ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఢిల్లీ లాంటి చోట్ల ఈ పరిస్థితులకు ఆక్సిజన్ కొరత తోడవడంతో.. ICUల్లో మరణమృదంగం మోగుతోంది.

మనదగ్గర లక్షలాది కేసులు వస్తున్నట్టు ఇంత దారుణమైన పరిస్థితులు చుట్టుపక్కల ఏ దేశంలోనూ లేవు. పాకిస్థాన్‌లో 5 వేల 800, బంగ్లాదేష్‌లో 3 వేల 629, నేపాల్‌లో 2449, శ్రీలంకలో 969 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇండియా తర్వాత అత్యధికంగా అమెరికాలోనే కేసులు నమోదవుతున్నా అక్కడ ఆ సంఖ్య 63 వేలే. కానీ మన దగ్గర ఇందుకు ఆరు రెట్లు ఎక్కువ పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. వైరస్ విలయం నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్‌తోపాటు అనేక దేశాల నుంచి విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీన లక్ష కేసుల మార్కు దాటినప్పటి నుంచి ఈ సంఖ్య 2 లక్షలు, 3 లక్షలు దాటి ఇప్పుడు 3 లక్షల 49 వేలకు వచ్చిందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story