దేశంలో కొత్తగా 93,249 కేసులు.. 513 మంది మృతి..!

దేశంలో కొత్తగా 93,249 కేసులు.. 513 మంది మృతి..!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తోంది. నిన్న ఒక్కరోజే ప్రపంచంలో మరే దేశంలో నమోదుకాని రీతిలో కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తోంది. నిన్న ఒక్కరోజే ప్రపంచంలో మరే దేశంలో నమోదుకాని రీతిలో కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల తర్వాత రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 93వేల 249 కేసులు నమోదుకాగా.. 513 మంది మృత్యువాతపడ్డారు. మరణాలు కూడా గతంలో కంటే ఎక్కువగా పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య కోటి 24లక్షల 85వేల 509కు చేరగా.. మరణాల సంఖ్య లక్షా 64వేల 623కు చేరుకుంది. ఇక కోటి 16లక్షల 29వేల 289 మంది డిశ్చార్జి అవ్వగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 6లక్షల 91వేల 623 ఉన్నాయి.

అయితే దేశంలోని 8 రాష్ట్రాల్లోనే కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకు పరిస్థితి తీవ్రమవుతోంది. ఇక జిల్లాల పరంగా చూస్తే.. పుణె, ముంబై, నాగ్‌పూర్, థానే, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్‌నగర్, నాందేడ్ నగరాల్లో 50 శాతం కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల పెరుగుదల తొమ్మిది రెట్లుగా ఉండగా, శాతాల పరంగా పంజాబ్ లో అత్యధికంగా నమోదు అవుతున్నాయి.

ఏప్రిల్ ఒకటి నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్ లో కంటే మన దేశంలోనే కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అమెరికా, బ్రెజిల్ లో 69వేల కు పైగా కేసులు నమోదుకాగా.. భారత్ లో 93 వేలకు పైగా కేసులు నమోదుకావడం ఆందోళన రేకిస్తోంది.

ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్‌ లో కరోనా సెకండ్ వేవ్ కలవరం సృష్టిసోంది. వారంలోనే 6వేల మంది ఆస్పత్రుల్లో చేరగా.. 40 మంది చనిపోయారు. అయితే మార్చురీలో సరిపడా ఫ్రీజర్లు లేకపోవడంతో మృతదేహాలనే నేలపైనే పడేశారు. ఇక శ్మశానాల్లోనూ అంత్యక్రియలకు చోటుకరువైంది. పీపీఈకిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.

కరోనా విజృంభణతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8తరగతుల వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్‌ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. 9, 10, 11 తరగతుల విద్యార్థులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అటు ఒడిశాను కరోనా వణికిస్తోంది. దీంతో 10 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు అధికారులు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story