Anil Deshmukh Arrest: మనీలాండరింగ్ కేసు పూర్తి దర్యాప్తుకు సమయం పడుతుంది.. అప్పటివరకు అనిల్ దేశ్‌ముఖ్..

Anil Deshmukh Arrest: మనీలాండరింగ్ కేసు పూర్తి దర్యాప్తుకు సమయం పడుతుంది.. అప్పటివరకు అనిల్ దేశ్‌ముఖ్..
Anil Deshmukh Arrest: మనీలాండరింగ్ కేసుపై ముంబయిలోని ప్రత్యేక కోర్టు శనివారం ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కనపెట్టింది.

Anil Deshmukh Arrest: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్‌ను ఈ నెల 12వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది బాంబే హైకోర్టు. ఇదే కేసుపై ముంబయిలోని ప్రత్యేక కోర్టు శనివారం ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కనపెట్టింది. అనిల్ దేశ్​ముఖ్​ను 5 రోజులపాటే విచారించామని.. అందులో రెండు రోజులు సెలవులేనని హైకోర్టుకు సమర్పించిన దరఖాస్తులో ఈడీ పేర్కొంది.

ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు తమకు మరికొంత సమయం కావాలని స్పష్టం చేసింది. ఈడీ దరఖాస్తును విచారించిన జస్టిస్ మాధవ్ జామ్​దర్​.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సహజ న్యాయ నియమాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 12 వరకు దేశ్‌ముఖ్‌ను ఈడీ కస్టడీకి అప్పగించాలని తీర్పునిచ్చారు.

శనివారం ఇదే కేసుపై విచారించిన ముంబయిలోని ప్రత్యేక కోర్టు.. దేశ్​ముఖ్​కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశ్​ముఖ్​ను విచారించేందుకు మరో 9 రోజులు రిమాండ్​ కావాలని ఈడీ అధికారులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

అనిల్ దేశ్​ముఖ్​ను ఈడీ అధికారులు ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్​ముఖ్​తో పాటు కుందన్​ షిండే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల వంద కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్‌ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ చర్యలు చేపట్టింది.

Tags

Read MoreRead Less
Next Story